పుట:Abaddhala veta revised.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసుకోవడంలేదు. ఎన్నికలలో తమకులం అభ్యర్ధికి ఓట్లువేయడం క్రైస్తవులలో వున్న జాడ్యమే. మతం మారినప్పటికీ సెక్యులర్ విలువలు రాకపొవడానికి యీ కారణాలన్నీ వున్నవి. సిద్ధాంతరీత్యా, మతం మారినవారికి కులం వుండరాదు. ఆ దృష్టితోనే మతం మారిన హరిజనులు ప్రభుత్వం యిచ్చే సౌకర్యాలకు అనర్హులన్నారు. క్రైస్తవ హరిజనుల్ని హిందూ హరిజనులతో సమానంగా చూడడంలేదు. ఆందోళనల ఫలితంగా వీరిని "ఇతర వెనుకబడిన తరగతులు" గా పరిగణిస్తున్నారు.

భారతదేశంలో పాశ్చాత్యీకరణ, మానవ విలువలు, వ్యక్తి స్వేచ్ఛ వ్యాపించడానికి క్రైస్తవుల విద్య చాలావరకూ ఉపకరించింది. కాని మతపరంగా వ్యవస్థలు, కులాలు, ప్రచారాలు, మతమార్పిడి సెక్యులరిజానికి అడ్డుగా నిలిచాయి. క్రైస్తవుల ప్రాబల్యం దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం. మతకలహాలు కూడా క్రైస్తవుల పరంగా వున్నవి తక్కువే. దేశంలోని జనాభాలో వీరిశాతం 3 మాత్రమే. కాని మతపరంగా సమస్యలు పరిస్కారం కావాలని క్రైస్తవులు కోరుకున్నంతకాలం కలహాలు తప్పవు. అందరికీ ఒకే చట్టం వుండాలని అంగీకరిస్తేనే సెక్యులరిజం వస్తుంది. అందరూ చట్టం ముందు సమానం అని అంగీకరించక, క్రైస్తవులుగా తాము ప్రత్యేక చట్టాన్ని కోరుకుంటామన్నప్పుడే చిక్కువస్తుంది. అందుకే పునర్వికాస ఉద్యమానికి పరోక్షంగా తోడ్పడిన క్రైస్తవులు, ప్రత్యక్షంగా అడ్డుపడుతున్నారు!

- హేతువాది, ఫిబ్రవరి 1990
పునర్వికాస పరిణామం
పునర్వికాసానికి సిక్కుల అవరోధం

భారతదేశంలో సిక్కులకు 500 సంవత్సరాల చరిత్ర వున్నది. గురునానక్ స్థాపించిన సిక్కుల మతం అటు హిందువుల, ఇటు ముస్లింల ఆచార సంప్రదాయాల సమ్మిళితంగా వచ్చింది. గురు పరంపర సంప్రదాయాన్ని పాటించే సిక్కులకు అర్జున్ వ్రాసిన ఆదిగ్రంధం ప్రమాణంగా వున్నది. గురుముఖ లిపిని పవిత్రంగా సిక్కులు పరిగణిస్తారు. సిక్కులు క్రమేణా వీరోచిత జాతిగా పరిణమించారు. ప్రత్యేక దుస్తులు ధరించడం, కృపాణం ధరించడం, జుట్టు పెంచడం వారి ప్రత్యేకత. సిక్కులు హిందువులలో భాగమేనని గాంధీజీ భావించినా, తరువాత అభిప్రాయం మార్చుకున్నారు. ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పడినట్లే, తమకూ సిక్కిస్తాన్ కావాలని వారు బ్రిటిష్ వారిపై వత్తిడి తెచ్చారు. సిక్కులు ప్రత్యేక గురుద్వారాలు నిర్మించుకున్నారు. ఈ గురుద్వారాలకు విపరీతమైన ఆస్తులున్నవి. మహంతులనే పురోహితులకు వాటిపై అజమాయిషీ వున్నది. శిరోమణి గురుద్వార ప్రబంధక సంఘం యీ గురుద్వార ఆస్తులపై అజమాయిషీ వహిస్తుంది. వంశపారంపర్యంగా వీటిని నిర్వహిస్తున్న పురోహితుల పెత్తనానికి 1925లో చట్టపరంగా బ్రిటిష్ వారు స్వస్తి పలికారు. ఐదేళ్ళకో పర్యాయం ఎన్నికలద్వారా సిక్కులు ఎన్నుకునే