పుట:Abaddhala veta revised.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సిక్కులు కలహాలకు దిగారు. హజారాసింగ్ గిల్ వర్గం 1965లో సంత్ ను అకాలీదళ్ నుండి బహిష్కరించింది. 1967లో అఖిల భారత సిక్కు కౌన్సిల్ ఉత్తమసింగ్ దుగ్గల్ నాయకత్వాన ఏర్పడింది.

1966లో పంజాబీసుబా ఏర్పడింది. మాస్టర్ తారాసింగ్ 1967 నవంబరు 22వ చనిపోయారు. సర్దార్ గుర్నాంసింగ్ నాయకత్వాన పంజాబ్ లో ఏర్పడిన అకాలీదళ్ మంత్రివర్గం అంతర్గత కలహాల వలన పడిపోయింది. చీలిపోయిన ముఠాలు 1968లో తాత్కాలికంగా కలిశాయి. అయినా చీలికలు ఆగలేదు. సర్దార్ గుర్నాంసింగ్ ఒక ముఠాకు, ప్రకాశ్ సింగ్ బాదల్ మరో ముఠాకు నాయకత్వం వహించారు. ఇలా చీలిపోయి, కలయికలు సాగిపోతుండగా, చండీఘడ్ నగరం పంజాబ్ లో వుండాలంటూ సంత్ ఫతేసింగ్ తాను అందుకై ఆత్మాహుతి గావిస్తానన్నాడు. 1972లో శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ ఏర్పడింది. గుర్ బక్ష్ సింగ్ దీనికి నాయకత్వం వహించాడు. సంత్ ఫతేసింగ్ రాజకీయాలనుండి విరమిస్తానని, మళ్ళీ రంగప్రవేశం చేశారు. 1973లో జలంధర్ లో మరో అకాలీదళ్ ముఠా ఏర్పడింది. ఈ విధంగా అకాలీదళ్ చీలికలు గందరగోళాన్ని సృష్టించాయి. రానురాను వీరి పోరాటం కాస్తా, తీవ్రవాద స్థాయికి పోయింది. కాంగ్రెసు పార్టీ కొన్నాళ్లు భింద్రన్ వాలా అతివాద నాయకత్వాన్ని బలపరచింది. అప్పుడు జైల్ సింగ్ హోంమంత్రిగా వున్నారు. సిక్కులలో ఒక వర్గం తీవ్ర నిర్ణయం తీసుకొని సిక్కులకు ఖలిస్తాన్ కావాలన్నది. కొందరు సిక్కులు ఇందుకు అంగీకరించలేదు. ఖలిస్తాన్ కోరినవారు భయానక వాతావరణం సృష్టించ ప్రారంభించారు. విదేశాలలో శిక్షణ పొందడం, ఆయుధాలు సేకరించడం తీవ్రస్థాయిలో జరిగింది. శత్రు సంహారం చేపట్టారు. ప్రధాని ఇందిరాగాంధి హయంలో పంజాబ్ లో పరిస్థితి చేయిదాటిపోయింది. అతివాదులు గురుద్వారాలను, అమృత్ సర్ లోని స్వర్ణమందిర ప్రాంగణాన్ని ఆక్రమించారు. వారిపై సైనికచర్య తీసుకున్నారు. సిక్కులు అనేకులు చనిపోయారు. ఇది తీవ్ర నిరసనకు గురైంది. ప్రధాని ఇందిరాగాంధి భద్రతా సిబ్బందిలో వున్న సిక్కులు ఆమెను కాల్చి చంపారు. ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సిక్కులను విచక్షణారహితంగా చంపేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సిక్కులలో చాలామందిని కాంగ్రెస్ కు, హిందువులకు దూరం చేసింది. విచారణ సంఘాలను నియమించినా ఉపశమనం జరగలేదు.

1989లో జరిగిన సాధారణ ఎన్నికలలో సిక్కులు కొందరు పంజాబ్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పాలనలో వున్న పంజాబ్ లో అతివాదుల చర్యల్ని అదుపులో పెట్టలేకపోయారు. వి.పి.సింగ్ ప్రధానిగా పంజాబ్ వెళ్ళి సిక్కుల సమస్య శాంతియుతంగా పరిష్కరిస్తామన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్నంతకాలం సిక్కులు శాంతం వహించలేదు.

మతాన్ని-రాజకీయాలను కలిపేసిన సిక్కుల సమస్య జటిలమైనదే.పునర్వికాసానికి, సెక్యులరిజానికి సిక్కుల ధోరణి ఆటంకమే.

- హేతువాది, మార్చి 1990