పుట:Abaddhala veta revised.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కె.ఎం. మున్షి, వల్లభాయి పటేల్ వంటి వారు మత స్వేచ్ఛను సమర్ధించారు. అదొక వరంగా క్రైస్తవులు వాడుకుంటున్నారు.

మతం మార్చుకున్నప్పటికీ పౌరహక్కులు, ఆస్తిహక్కులు కోల్పోరని 1850లోనే బ్రిటిష్ వారు శాసనం చేసారు.

కాని హిందూ ఆస్తి సంక్రమణ చట్టం అందుకు విరుద్ధంగా వుంది. మతమార్పిడిని నిరుత్సాహపరచాలని హిందూ వంశపారంపర్య చట్టం (1956) ఉద్దేశించారు. మతం మారితే విద్యాసంస్థలో హరిజనులకు యిచ్చే ప్రభుత్వ సౌకర్యాలు వుండవని 1947లోనే బొంబాయి ప్రభుత్వం శాసనం చేసింది. ఇలాంటి ధోరణి యితర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మతపరంగా వచ్చిన యీ విచక్షణ సెక్యులర్ ధోరణులకు తీవ్ర ప్రతిబంధకమైంది. సమస్యను మనుషుల పరంగా చూడక, చట్టాలు చేసేటప్పుడు మతాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. క్రైస్తవ మిషనరీల పట్ల ఒకవైపున సనాతన హిందువులు నిరసన వ్యక్తపరుస్తుంటే, ఉదారవాదులు వారి సేవల్ని ప్రస్తుతించారు. వారి విద్యావిధానాన్ని మెచ్చుకుంటూ తమ పిల్లల్ని మిషనరీ స్కూళ్ళకే పంపిస్తున్నారు. వారి "క్రమ శిక్షణ"ను తెగ పొగుడుతున్నారు.

స్వాతంత్ర్యానంతరం దేశంలో క్రైస్తవ మిషనరీలు విపరీతంగా పెరిగిపోయి 1952 నాటికే 4683 వరకూ వచ్చాయి. ఇందులో విదేశీయులు చాలా ఎక్కువగానే వుండేవారు. ఉత్తరోత్తరా వారి సంఖ్య తగ్గిపోగా, దేశీయులు ఆస్థానాల్లోకి వచ్చారు. క్రైస్తవుల చదువుల పట్ల మెప్పు వున్నా, మిగిలిన అన్ని విషయాల్లో వారి పట్ల దేశంలో చిన్నచూపు వున్నది. 1952 నుండీ క్రైస్తవ విదేశీ మిషనరీలకు వీసాలు యివ్వడం అదుపులోపెట్టారు. తీవ్రవాదులైన హిందూ సనాతనులు క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేశారు. రామరాజ్యపరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్యసమాజ్, హిందూ మహాసభ యిలాంటి కార్యకలాపాలు చేబట్టాయి. మధ్యప్రదేశ్ లో, నాసిక్ లో క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందూ మహాసభ చేసిన ఆందోళన వలన 1954లో నియోగి సంఘాన్ని మధ్యప్రదేశ్ (పరగణాలు) ప్రభుత్వం నియమించాల్సి వచ్చింది.

క్రైస్తవులు మతమార్పిడి కార్యకలాపాలు ఎక్కువ చేసి అస్సాం నాగాలను, బీహార్ జార్ఖండ్ లను, మధ్యప్రదేశ్ లో ఆదివాసులను మార్చేస్తున్నారని హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. నియోగి సంఘం విచారణ జరిపింది. 1956లో (ఏప్రిల్ 18) యీ నివేదిక వెల్లడైంది. డా ఎం.బి. నియోగి నాగపూర్ హైకోర్టునుండి రిటైర్ అయిన ప్రధానన్యాయమూర్తి, ఆరుగురు సభ్యులు కూడా యీ విచారణ సంఘంలో వున్నారు. ఇందులో ఎస్.కె. జార్జి అనే సిరియన్ క్రైస్తవుడు కూడా వున్నారు. విచారణ పట్ల కేథలిక్కులు అభ్యంతరం తెలిపారు.

విచారణ సంఘ నివేదికను బట్టి, మతమార్పిడి దేశ ఐక్యతను విచ్ఛిన్నపరచే ఉద్దేశ్యంతో జరుగుతున్నది. ముస్లింలీగ్ వలె క్రైస్తవులు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని (దేశాన్ని) కోరవచ్చు.