పుట:Abaddhala veta revised.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతమార్పిడి చేస్తున్న మిషనరీలను ఉపసంహరించాలి. విదేశీయులను అదుపులో పెట్టాలి. మతప్రచార స్వేచ్ఛను భారతీయులకే పరిమితం చేసేట్లు రాజ్యాంగ సవరణ చేయాలి. మత ప్రచారాన్ని పూర్తిగా తొలగించే శాసనం కూడా ఉత్తరోత్తరా చేయాలని నియోగి సంఘం కోరింది.

ప్రభుత్వ అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచార గ్రంథాలు పంచనివ్వరాదన్నారు. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా అట్టిపెట్టాలని, మతసంస్థల జోక్యం వుండరాదనీ అన్నారు. నియోగి సంఘ సిఫారసులను క్రైస్తవులు వ్యతిరేకించారు. హరే కృష్ణ మెహతాబ్, అల్లాడి కృష్ణస్వామి వంటివారు కూడా నియోగి సంఘ సిఫారసులను నిరసించారు. కాని సనాతన హిందూ మనస్తత్వాన్ని నియోగి సంఘ నివేదిక ప్రతిబింబించింది. సెక్యులర్ ధోరణులకు పచ్చి వ్యతిరేకతను చూపిన యీ నివేదికను అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చించారు.

క్రైస్తవుల-కమ్యూనిస్టుల దోబూచులాట!

కమ్యూనిస్టులు-కేథలిక్కులు దేశంలో సెక్యులరిజంతో బాగా ఆడుకున్నారు. కేరళలో కేథలిక్కులు కమ్యూనిస్టుల్ని కోపు వేసుకోవడం బిషప్పులకు వింతగా తోచింది. అలాంటి కమూనిస్టు మద్దత్తుదారులను మతం నుండి వెలిచేస్తామని బిషప్పులు బెదిరించారు. 1960లో కేరళలో కమ్యూనిస్టుల్ని బలపరచిన కేథలిక్కులను త్రివేండ్రం ఆర్చ్ బిషప్ వెలివేశారు. కమ్యూనిస్టుల్ని బాహాటంగా బలపరచినా, ఓటువేసినట్లు తెలిసినా అలాంటి కేథలిక్ లు వెలికి గురయ్యారు. ఇది అన్యాయమని కమ్యూనిస్టులు భావించారు.

లోక్ సభలో తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు సభ్యుడుగా బిల్లు ప్రవేశపెడుతూ రాజకీయల్లోకి మతం చొచ్చుక రావడాన్ని ఆపాలన్నారు. కేథలిక్ చర్చిని రాజకీయ ప్రయోజనాలకు వాడడాన్ని ఆపాలని బిల్లు ఉద్దేశించారు.

కమ్యూనిస్టుల బిల్లు ఓడిపోయినా,ఆసక్తికరమైన చర్చ సాగింది. తమ ఆధ్యాత్మిక ధోరణికి వ్యతిరేకంగా వున్న రాజకీయ పార్టీకి ఓటువేయవద్దని చెప్పే అవకాశం కేథలిక్కులకు వున్నదని హోంమంత్రి బి.ఎన్.దాతార్ వాదించారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించారు. సనాతన హిందూలు, కొందరు కాంగ్రెస్ వారు సైతం నాగిరెడ్డి బిల్లును సమర్ధించారు. బిల్లు వీగి పోయిందనుకోండి.

లోక్ సభలో మరో కమ్యూనిస్టు సభ్యుడు ఎస్.వి.పరులేకర్ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదించలేదు. ప్రార్థనా ప్రదేశాలు, యాత్రాస్థలాలు రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని యిందలి సారాంశం. 1961 ఫిబ్రవరిలో వచ్చిన యీ అనధికార తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విధంగా సెక్యులర్ వ్యతిరేక ధోరణులు చట్టసభలలో అధికారపక్షం ప్రదర్శిస్తూనే వచ్చింది.

భారతదేశ విద్యావిధానంలో మతపరమైన చదువు చెప్పాలని మన ప్రథమ విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నెహ్రూ దీనిని వ్యతిరేకించారు. క్రైస్తవులు మతం