పుట:Abaddhala veta revised.pdf/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

డచ్, ఫ్రెంచ్,ఇంగ్లీషువారు ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా మరికొంత క్రైస్తవాన్ని దేశంలోకి తెచ్చారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీవారు భారతదేశంలో వ్యాపారం ప్రధానంగా భావించారు. మత, సాంఘిక విషయాలలో తటస్థంగా వుండాలనుకున్నారు. దేశంలో ప్రొటెస్టంట్ మతాన్ని ప్రచారంచేసే ఉద్దేశంతో 1698లో దేశీయ భాషలు నేర్చుకోవాలని పార్లమెంటు చట్టం చేసింది. కాని దేశంలో వ్యాపారం సాఫీగా సాగాలంటే మతం జోలికి పోరాదని కంపెనీ తన లౌకిక విధానంగా నిర్ణయించింది. ఆ పని పోర్చుగీసువారు చేయలేదు. 1546 నుండే పోర్చుగీసువారు గోవాలో కేథలిక్ శాఖను బలవంతంగా రుద్దారు. దేశీయ మతాచారాలపై ఆంక్షలు పెట్టారు. నేటికీ గోవాలో కేథలిక్ మతం వ్యాపించి వుండడానికి చారిత్రక కారణాలివే.

బ్రిటిష్ పాలకులు కొందరు తటస్థ వైఖరిని ప్రోత్సహించగా, మరికొందరు క్రైస్తవ మత ప్రచారాన్ని కాదనలేదు. కనుక మత ప్రచారకులు 1705 నుండీ తమ కార్యకలాపాలు పరిమితంగా సాగించారు. భారతదేశంలో మత ప్రచారాన్ని ప్రభుత్వపరంగా చేయాలనే ప్రయత్నాన్ని 1793లోనే బ్రిటిష్ పార్లమెంట్ నిరాకరించింది. 1813 నాటికి దేశంలో క్రైస్తవ మత ప్రచారకులకు అధికారిక స్థానం కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమానుషమైన హిందూ ఆచారాలు కొన్ని తొలగించాలని మిషనరీలు పట్టుబట్టారు. సతీ సహగమనం, అంటరానితనం యిందులో వున్నాయి. లార్డ్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ గా సతీ సహగమనాన్ని నిషేధించడానికి భారతీయుల మద్దత్తు, సహకారం కోరాడు. రామమోహన్ రాయ్ వంటివారు నిషేధాన్ని అనుకూలించారు. ఛాందస హిందువులు వ్యతిరేకించారు. కుల ప్రాతిపాదికగా హిందువులలో వంశపారంపర్య ఆస్తి సంక్రమణ మొదలైన హక్కులు మతం మార్చుకున్న వారికి పోతాయి. ఇలా జరగరాదని 1832లో బెంగాల్ నిబంధన క్రింద శాసించారు. సనాతనులు ఎప్పటికప్పుడు తమ మత విషయంలో బ్రిటిష్ పరాయి పాలకులు జోక్యం చేసుకుంటున్నారంటూ అభ్యంతరపెడుతూనే వచ్చారు.

బ్రిటిష్ పాలకులు 1850లో చట్టం చేస్తూ మతాన్ని మార్చుకున్న వారితో సహా అందరికీ విద్యాసంస్థలలో నిధులు సమకూర్చుతామనీ,మతం మార్చుకున్న వారికి సైతం రక్షణ కల్పిస్తామన్నారు. అప్పుడే క్రైస్తవ మిషనరీలు విద్యాసంస్థల్ని బాగా ప్రారంభించాయి. సెక్యులర్ ధోరణిలో విద్య సాగాలని ప్రభుత్వం కోరింది. హిందూమతం ప్రమాదంలో వున్నదని సనాతనులు గోలపెట్టారు. 1857 సిపాయి తిరుగుబాటు అనంతరం విక్టోరియా రాణి చేసిన ప్రకటనలో క్రైస్తవ మతాన్ని బలవంతంగా రుద్దబోమన్నారు. మతంలో జోక్యం చేసుకోమన్నారు.

కాని 19వ శతాబ్దం మధ్యనుండే బ్రిటిష్ ప్రభుత్వం బిషప్పులను నియమించింది. మతపరంగా తటస్థంగా వుంటామన్న బ్రిటిష్ వారు ఆ సూత్రాన్ని దాటేశారు. క్రైస్తవ మతంలోకి హిందువుల్ని మార్చడం కొనసాగింది. బిషప్పులు ఇందులో ప్రముఖపాత్ర వహించారు. ప్రభుత్వ అజమాయిషీ తమపై వుండరాదని బిషప్పులు, క్రైస్తవ మతాధిపతులు పట్టుబట్టారు. క్రమేణా ప్రభుత్వ పట్టు సడలగా, క్రైస్తవ మతసంస్థలు తమ మనుగడ సాగించాయి.