పుట:Abaddhala veta revised.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1927లో బ్రిటిష్ పార్లమెంటు చట్టరీత్యా ఇంగ్లండ్ లో బిషప్పులను నియమించి ఇండియాకు పంపడాన్ని ఆపేసింది. మతంపై బ్రిటిష్ ప్రభుత్వం పెత్తనం వదిలేసి, ఇండియాలో కార్యకలాపాలకు స్వేచ్ఛనిచ్చింది. మతాధిపతులు చట్టరీత్యా స్వతంత్రులైనా బ్రిటిష్ ప్రభుత్వంలో సన్నిహితంగానే వుంటూ వచ్చారు. ఏదో రూపేణా ప్రభుత్వం నుండి దేవాలయాల నిర్వహణకు నిధులు లభిస్తుండేవి. ఇంగ్లండ్ చర్చికి ప్రభుత్వం నుండి దేవాలయాల నిర్వహణకు నిధులు లభిస్తుండేవి. రోమన్ కాథలిక్, వెస్లీ, ప్రెచిటేరియన్, శాఖలకు యిలాంటి ప్రభుత్వ ఆదరణ లభించకపోయినా, వారికి విదేశీ సహాయం అందేది. భారతదేశంలో బ్రిటిష్ వారి క్రైస్తవ మత విధానానికి 1948 మార్చి 31న స్వస్తి పలికారు. అంతవరకూ వున్న భారత క్రైస్తవ మత చట్టాన్ని రద్దుగావించారు. (The Indian Ecclesiastical Establishment Act)'

భారత రాజ్యాంగం ప్రకారం మతస్వేచ్ఛ అందరికీ వున్నది. మతాన్ని యధేచ్ఛగా అనుసరించవచ్చు, ఆచరించవచ్చు,ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వం యీ విషయంలో కేవలం ప్రజారోగ్యం, నీతి, ప్రజా కట్టుదిట్టాల దృష్ట్యానే జోక్యం చేసుకోవచ్చు. ఆయా మత సంస్థలు తమ సంస్థల్ని కొనసాగించవచ్చు. ఆస్తుల్ని సంక్రమింపజేసుకోవచ్చు. చట్టానికి లోబడి తమ సంస్థల, ఆస్తుల పాలన సాగించడానికి రాజ్యాంగ రీత్యా మతపరమైన వారికి హక్కులు వచ్చాయి. ఇది ఆసరాగా తీసుకొని క్రైస్తవ మిషనరీలు తమ కార్యకలాపాలను దేశంలో సాగించారు. విద్యాసంస్థల్ని, ఆసుపత్రుల్ని పెట్టారు. అల్పసంఖ్యాకవర్గంగా క్రైస్తవులు కొన్ని ప్రత్యేక హక్కులు పొందారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో క్రైస్తవుల కార్యకలాపాల్ని సనాతన హిందువులు అభ్యంతరపెడుతూ వచ్చారు. ఇవి మతకలహాలు వరకూ దారితీశాయి.

కేరళలో క్రైస్తవ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు భారీగా అందుతుండేవి. 1957లో సంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, క్రైస్తవుల మతాధికారాల్ని తగ్గించే చట్టం తెచ్చారు. దీని ప్రకారం కొన్ని పరిస్థితులలో మత విద్యాసంస్థల యాజమాన్యాన్ని అవసరమనుకుంటే ప్రభుత్వం చేబట్టవచ్చు. సుప్రీంకోర్టు యిందుకు అభ్యంతరపెట్టింది. అయితే ఫీజుల వసూళ్ళు, ఉపాధ్యాయుల నియామకం, జీతాల చెల్లింపులో క్రమబద్ధత పాటించేటట్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేరళలో క్రైస్తవులు కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రతరం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేరళలో క్రైస్తవుల ప్రవర్తన, దీనికి కాంగ్రెసు వారిచ్చిన మద్దత్తు వలన, సెక్యులరిజం అర్థం మారిపోయింది. మతం విజృభించి తన పరిధిని విస్తరించింది.

1909లో బ్రిటిష్ పాలకులు ఇండియాలో మతస్తులకు ప్రత్యేక ఓటు హక్కు యిచ్చారు. దీని ప్రకారం క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు తమ మతపరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే హక్కు వున్నది. శాసనసభలలో ఆ విధంగా మత ప్రాతినిధ్యం వుండేది. భారత రాజ్యాంగం రూపొందించిన తరువాత యీ పద్ధతికి స్వస్తి చెప్పారు. బ్రిటిష్ పాలకులు సెక్యులర్ వ్యతిరేక ధోరణిలో మతాన్ని ప్రోత్సహించగా,క్రైస్తవులు దీనిని ఆసరా చేసుకొని మతవ్యాప్తికి కృషి చేశారు.