పుట:Abaddhala veta revised.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింల పాలనలో రాజభాషగా ఉర్దూ వుండేది. దీనిస్థానే ప్రజలు మాట్లాడుకునే హిందీ ప్రవేశపెట్టాలని ఉత్తరోత్తరా కాంగ్రెసు కోరింది. ముస్లిం ఔన్నత్యానికి ఉర్దూ మారురూపం అని భావించిన సర్ సయ్యద్ యీ మార్పును కూడా వ్యతిరేకించాడు. హిందువులు-ముస్లింలు కలసి పనిచేయడం కష్టమని సర్ సయ్యద్ జోస్యం చెప్పాడు.

సర్ సయ్యద్ గాని ఆయన అనుచరులుగాని ముస్లింలను రాజకీయాలలో ప్రోత్సహించలేదు. సాంఘిక సంస్కరణ సైతం ఆశించలేదు. కేవలం విద్యపై వారు దృష్టిపెట్టారు. తరువాత ధోరణి మార్చుకొని భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన కొద్దికాలానికే మహమ్మదీయ విద్యాసభను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ హిందువులదని,దీనినుండి దూరంగా వుండాలని సర్ సయ్యద్ ముస్లింలకు చెప్పాడు. దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని ఆయన కోరుకున్నాడు.

సిపాయీల తిరుగుబాటులో ముస్లింలు పాల్గొనలేదనీ,అది హిందువుల చర్య అనీ సర్ సయ్యద్ స్పష్టం చేశాడు. ఆయన అప్పట్లో యీస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. క్రైస్తవులైన బ్రిటిష్ వారి పాలనకు ముస్లింలు వ్యతిరేకులు కాదంటూ, తిరుగుబాటులో ఎవరైనా పాల్గొంటే అలాంటి ముస్లింలు ద్రోహం చేసినట్లే అన్నాడు.

బ్రిటిష్ పాలకులు భారతీయులు తెలుసుకొని చట్టాలు చేయాలని, ఇందుకుగాను శాసనసభలలో భారత ప్రతినిధులుండాలన్నారు సర్ సయ్యద్. అయితే ఉన్నత వంశస్తులే అందులో ప్రవేశించాలన్నాడు!

ముస్లిముల్లో కొద్దోగొప్పో పునర్వికాసభావాలు ఏర్పడ్డాయంటే, సర్ సయ్యద్ వెలిబుచ్చిన, స్థాపించిన విద్యాసంస్థలే కారణం. పాత సంప్రదాయాల విద్యకు బదులు ఇంగ్లీషు చదువులు అవసరమని ఆయన ముస్లింలకు నచ్చజెప్ప ప్రయత్నించాడు. కాని ఛాందసులు వినిపించుకోలేదు. సంప్రదాయ విద్య ముస్లింలను వెనుకబడినవారిగా అట్టిపెడుతున్నదని సత్యాన్వేషణకు దోహదం చేయడం లేదనీ సెలక్ట్ కమిటీ ముందు చెప్పాడు. పాత చదువులలో కట్టుకథలు జాస్తిగా వున్నాయనీ, ఆధారాలు తక్కువనీ అంటూ, అతిశయోక్తులతో నమ్మించే ప్రయత్నాలు జరిగాయని పాత ముస్లిం విద్యను ఆయన ఖండించారు. దీనివలన కాలయాపన విపరీతంగా జరిగిందన్నారు. తాను చెప్పేది ఛాందస ముస్లింలకు నచ్చదని తనకు తెలుసునని కూడా ఆయన చెప్పారు. అలాంటి భావాలు వెల్లడించినందుకు ముస్లిం సనాతనులు సర్ సయ్యద్ పై దుమ్మెత్తి పోశారు. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విద్యను ముస్లింలు చదవపోతే,వారు శాశ్వతంగా వెనుకబడే వుంటారని కూడా సర్ సయ్యద్ హెచ్చరించారు. పాశ్చాత్య విద్యను, సైన్సును ఆహ్వానించి, 1877లొ మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి స్థాపించిన సర్ సయ్యద్ ఆ విధంగా ముస్లిముల్లో కొందరిని సరైన బాటలో నడిపించే ప్రయత్నం చేశాడు.

ఎన్నికల పద్ధతిలో ప్రతినిధులు శాసనసభలకు వచ్చే పద్ధతి వలన అధిక సంఖ్యాకులైన