పుట:Abaddhala veta revised.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందువులకు బలం లభిస్తుంది. మతద్వేషాలు విపరీతంగా వుంటూ,కుల చీలుకలు రగులుకొంటున్న చోట యిలాంటి ప్రాతినిధ్యం మంచిది కాదని సర్ సయ్యద్ అభిప్రాయం వెల్లడించాడు. అల్పసంఖ్యాకులు దెబ్బతింటారని, అధికసంఖ్యాకులు పెత్తనం చేస్తారని ఆయన ముస్లింలను భయపెట్టాడు.

కాంగ్రెస్ పార్టీ తమపెట్టిన జాతీయోద్యమంలో పాల్గొనవద్దని సర్ సయ్యద్ స్పష్టంగా ముస్లింలను కోరాడు. కాంగ్రెస్ పార్టీ వలన ముస్లింలకు ప్రయోజనం చేకూరదన్నాడు. ముస్లింలు అధిక సంఖ్యాకుల ఉద్యమానికి దూరంగా వుండాలంటూనే, పాశ్చాత్యవిద్యను అభ్యసించాలని చెప్పిన సర్ సయ్యద్ పరస్పర విరుద్ధంగా ప్రవర్తించాడు. వేర్పాటు ధోరణులకు ఆయన బీజాలు నాటాడు. కనుక పాశ్చాత్య విద్యను అభ్యసించిన ముస్లింలు సైతం మత ప్రభావం వలన జాతీయోద్యమానికి దూరంగా వున్నారు. ఆ మేరకు ముస్లిం మతగురువులు ముస్లింలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.

భారతీయ ముస్లింలలో అత్యంత ప్రాధాన్యత చూపెట్టిన మహమ్మద్ ఇక్బాల్ (1873-1938)సైతం, ఆధునీకరణస్థానే, ఇస్లాం పునరుద్ధరణే కోరుకున్నాడు. ఆధునిక ప్రపంచ రీతుల్ని ఇస్లాం పద్ధతులలోకి మలచుకోవాలన్నాడు. గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యంకాదని ఆయన రాశాడు. సెక్యులర్ భావాలను వ్యతిరేకించాడు. మతాన్ని, రాజ్యాన్ని,రాజకీయాలను మిళితం చేయాలన్నాడు. అఖిలభారత ముస్లింలీగ్ ను ప్రోత్సహించాడు. నాస్తికత్వాన్ని, పదార్ధవాదాన్ని వ్యతిరేకించాడు. జాతీయవాదం, సోషలిజం స్థానే ఇస్లాం కావాలని ఇక్బాల్ కోరుకున్నాడు. పెట్టుబడిదారీ విధానం కూడా పనికిరాదన్నాడు. రాజకీయవ్యవస్థ అంతా ఇస్లాం పరంగా సాగాలన్నాడు. అయితే మార్క్సిజాన్ని,లెనిన్ ను మెచ్చుకుంటూ పద్యాలు రాశాడు. హిందూ-ముస్లిం ఐక్యతను కోరిన ఇక్బాల్,క్రమేణా పాకిస్తాన్ భావానికి పితామహుడయ్యాడు. ఇప్పటికీ ఆయన ఆలాపించిన 'హిందుస్తాన్ హమారా' గేయాన్ని చాలామంది ఆప్యాయంగా పాడుకుంటూనే వున్నారు. కాని, భారతజాతీయవాదంలో ముస్లింలు అల్పసంఖ్యాకులుగా బాధితులౌతారనే దృష్టిలో ఆయన జాతీయోద్యమానికి అనుకూలించలేదు.

భారతదేశంలో ముస్లింలు పెద్ద అల్పసంఖ్యాకవర్గంగా ఇక్బాల్ పేర్కొని,క్రమేణా పాకిస్తాన్ భావాన్ని ప్రచారం చేశాడు.

ముస్లిం నాయకుల వేర్పాటుధోరణి బ్రిటిష్ పాలకులకు నచ్చింది. కాంగ్రెస్ ను బలహీనపరచడానికి ముస్లింలను ప్రోత్సహించారు. సర్ సయ్యద్ అనంతరం, బెంగాల్ విభజన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, లార్డ్ మింటో ఈ ప్రయత్నాలు చేశాడు. ముస్లింలు కొందరు ఆగాఖాన్ నాయకత్వాన 1906 అక్టోబరు 1న సిమ్లాలో వైశ్రాయిని కలసి, తమకు ప్రత్యేక సౌకర్యాలు, ఏర్పాట్లు, ప్రాధాన్యత కావాలని అడిగాడు.