పుట:Abaddhala veta revised.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత ముస్లింలలో షావాలి యుల్లాను అనుసరించేవారు అత్యధిక సంఖ్యలో వుండగా, కొందరు సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ ధోరణి సబబు అనుకుంటున్నారు. సరిహద్దు గాంధి అని పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పంధాను పాటించగలవారి సంఖ్య వేళ్ళపై లెక్కించవచ్చు. సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ పునర్వికాసానికి కొద్దిగా నాంది పలికాడు. ముస్లింలు పాశ్చాత్య విద్యను చదవాలన్నాడు. ఆ మాత్రానికే ఆయన్ను "కాఫిర్" అని ముస్లిం మతగురువులు (ఉలేమాలు) పేరెట్టి తిట్టిపోస్తూ 'ఫత్వా' జారీ చేశారు.

ముస్లింలలో స్వల్పంగానైనా పునర్వికాసానికి బీజాంకురాలు నాటింది సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ అని చెప్పవచ్చు. ఆయనలో మతమౌఢ్యం తక్కువ అయితే ముస్లింలు ఒకప్పుడు పరిపాలించారనే విషయం విస్మరించలేని స్థితిలో ఖాన్ కూడా వుండేవాడు. అలీఘడ్ లో ముస్లింల ఆధునిక విద్యకు ప్రాతిపదికలు వేసిన సర్ సయ్యద్,పక్కనే ముస్లింల వేర్పాటువాదానికి కూడా బీజాంకురాలు నాటాడు.

సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ (1817-1898) మతాన్ని, సైన్సు ను సమన్వయీకరించే ప్రయత్నం చేశాడు. ఇవి రెండూ పరస్పర విరుద్ధాలు కావన్నాడు.

సిపాయి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారి ఉద్యోగిగావున్న సర్ సయ్యద్, తిరుగుబాటును ఖండించి, ముస్లింలు బ్రిటిష్ వారికి విధేయులుగా వుండాలన్నాడు. ఒకవైపున ముస్లింల ఆధిపత్యం క్షీణించిపోగా, ఇస్లాంను జాగ్రత్తగా నిర్వచిస్తూ ఆధునికతతో సర్దుబాటు చేయాలని సర్ సయ్యద్ ప్రయత్నించాడు. సైన్సు, ఇస్లాంలు విరుద్ధాలు కావంటూ వ్యాఖ్యానాలు చేసి, అలీఘడ్ లో 1862లో సైంటిఫిక్ స్థాపించాడు. 1875లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సర్ సయ్యద్ ఆధునిక విద్యను ముస్లింలలో వ్యాపింపజేయాలని సంకల్పించాడు. శాస్త్రీయ చారిత్రక ప్రాధాన్యత గల పుస్తకాలను ఉర్దూలోకి అనువదించాలని ప్రోత్సహించాడు. ఈ మాత్రానికే ముస్లిం మత గురువులు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి గురికాదలచుకోక,మత విద్యవరకూ వారిదే పెత్తనం అన్నాడు. అది సాకుగా తీసుకొని మతగురువులు తమ ఆధిపత్యాన్ని అట్టిపెట్టుకొని సైన్సు విద్య ప్రబలకుండా చూచారు. ముస్లింలలో రినైజాన్స్ రాకపోడానికి ఆదిలోనే ఆటంకం ఏర్పడిందన్నమాట.

దేశంలో కాంగ్రెసు పార్టీ ఏర్పడినప్పుడు, అలీఘడ్ లో సర్ అహమ్మద్ ముస్లింల ఆధునీకరణ ఆరభించాడు. జాతీయ కాంగ్రెస్ లో అడ్డుపడ్డాడు. ఇది బ్రిటిష్ వారికి నచ్చింది. అలీఘడ్ ముస్లిం విద్యాసంస్థలకు మద్దతు ప్రకటించిన బ్రిటిష్ వారు, చీలించి పాలించడానికి సర్ సయ్యద్ తోడ్పడ్డాడు. రాష్ట్ర కేంద్ర శాసనసభలలో ప్రాతినిధ్యం విస్తృత ప్రాతిపదికపై వుండాలని కాంగ్రెసు కోరితే,సర్ సయ్యద్ వ్యతిరేకించాడు. అలగా జనం అలాంటి ఉన్నత సంస్థలలో ప్రాతినిధ్యం వహించరాదని సర్ సయ్యద్ ఉపన్యాసాలిచ్చాడు. ఇది బ్రిటిష్ వారి ధోరణికి సరిపోయింది.