పుట:Abaddhala veta revised.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణమూర్తి తండ్రి కోర్టుకు వెళ్ళి తన కుమారులను తనకు అప్పగించమన్నాడు. హైకోర్టులో చాలాకాలం కేసు సాగింది. సి.పి.రామస్వామి అయ్యర్ యీ కేసులో అనిబిసెంటుకు వ్యతిరేకంగా వాదించాడు. కోర్టు అజమాయషీలో పిల్లల సంరక్షణ సాగాలని తీర్పు వచ్చింది. కాని అనిబిసెంటు ప్రీవీకౌన్సిల్ కు వెళ్ళి తన అజమాయిషీలోనే వుండాలనే వాదనలో నెగ్గింది. ఆ తరువాత కృష్ణముర్తి ఇంగ్లండ్ లో ఉన్నత చదువులు కొనసాగించాడు.

జిడ్డు కృష్ణమూర్తి యుగపురుషుడని అనిబిసెంటు ప్రకటించింది. దివ్యజ్ఞాన సమాజంలో ప్రముఖస్థానం ఆక్రమించిన జిడ్దు కృష్ణముర్తి క్రమేణా మూఢ నమ్మకాలు, అనిబిసెంటు ప్రచారాలపట్ల ఏవగింపు పెంచుకున్నాడు. తాను ప్రవక్తను కానని స్పష్టంచేశాడు. దివ్యజ్ఞాన సమాజంతో తెగతెంపులు చేసుకున్నాడు. అనిబిసెంట్ యిదంతా చూచి కుంగిపోయింది. కాని చేసేదిలేక దిగమింగింది. కృష్ణమూర్తి ఒకవైపున అనిబిసెంటును, ఆమె అనుచరులనూ తీవ్రంగా దుయ్యబట్టాడు. ఆ తరువాత జిడ్డు కృష్ణమూర్తితో బాటుగా, చాలామంది దివ్యజ్ఞాన సమాజానికి దూరమయ్యారు. అనిబిసెంటుకు కేవలం మద్రాసులో కొందరు బ్రాహ్మణులు మాత్రం అనుచరులుగా మిగిలారు. దివ్యజ్ఞాన సమాజం నానాటికీ క్షీణించింది. జిడ్డు కృష్ణమూర్తి అమెరికా వెళ్ళిపోయాడు.

1916లో హోంరూల్ లీగ్ స్థాపించిన అనిబిసెంటు 1917లో కాంగ్రెసు అధ్యక్షురాలైంది. ఇంగ్లండ్ కూ, ఇండియాకు పూర్వజన్మ సుకృత సంబంధం వున్నదన్నది! గాంధిజీ రాజకీయాలలో ప్రవేశించి భారత స్వాతంత్రోద్యమంలో ముమ్మరంగా ఉద్యమాలు చేబట్టిన తరువాత అనిబిసెంటు తగ్గిపోయింది. సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, పన్నుల ఎగవేత వంటివి మంచిదికాదని అనిబిసెంటు చెప్పింది. జీవితం చివరి ఘట్టంలో అనిబిసెంటు ఆకర్షణ బాగా క్షీణించింది. 1933లో అనిబిసెంటు మరణించింది.

అనిబిసెంటు 1923లో ఇంగ్లీషులోకి గీతను అనువదించింది. అప్పటికి బ్లావట్ స్కీ ప్రభావం ఆమెపై క్షీణించినా, దివ్యజ్ఞాన సమాజంవారు భక్తి, నిష్కామకర్మలకు ప్రాధాన్యత యిచ్చారు. రామకృష్ణ, వివేకానంద ఆశ్రమాలకూ దివ్యజ్ఞాన సమాజం వారికీ ఎప్పుడూ పడేదికాదు.

1917లో అనిబిసెంటు ఆధ్వర్యాన కాంగ్రెసు సమావేశం అంటరానివారిపట్ల సానుభూతి తీర్మానం చేసింది. విచక్షణ పోవాలన్నది. కాని అంతకుముందు అనిబిసెంటు రచనలలో అగ్రకులాలవారిని, అంటరానివారిని పాఠశాలల్లో కలిపి కూర్చోబెడితే అనర్ధాలు, అంటురోగాలు వస్తున్నట్లు వ్యాఖ్యానించింది.

గాంధీజీకి అనిబిసెంటుకు పడేదికాదు. గాంధేయ పద్ధతులను రాజకీయాలలో ఆమె నిరసించి, గర్హించింది. 1917లో బెనారస్ లో గాంధీ మాట్లాడుతూ వైస్రాయిని ఖండిస్తుండగా, ఉపన్యాసం ఆపేయవలసిందిగా అధ్యక్షుడిని అనిబిసెంటు కోరింది. రానురాను రాజకీయాలలో