పుట:Abaddhala veta revised.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీది పై చేయి కాగా,అనిబిసెంటు పలుకుబడి తగ్గుముఖం పట్టింది. రాజకీయాలను, మతాన్ని కలిపేసి, సెక్యులర్ ధోరణులకు తావులేకుండా అనిబిసెంటు ప్రాతిపదికలు వేసింది. అసలే అజ్ఞానంతో, నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశానికి అనిబిసెంటు, దివ్యజ్ఞానం పేరిట మరింత కట్టుకధల, పురాణాల, అంధకారాన్ని విరజిమ్మింది. దేశంలో కొద్దిమంది చదువుకున్న వారిని ఇంకా వెనక్కు నడిపించింది.

ఛార్లస్ బ్రాడ్లాతో కలసి యూరోప్ ను ఉర్రూతలూగించిన అనిబిసెంటు 50 సంవత్సరాల పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తి అలా అత్యున్నత దశకుపోయి, పతనమైంది. ఎందుకని? తలాతోక లేని మూఢనమ్మకాలను ప్రజలపై రుద్ది, నమ్మించడానికిగాను అనిబిసెంటు హేతువాదాన్ని వదలేసింది. తాత్కాలికంగా ఆమెకు కొందరు నీరాజనం పట్టి, డబ్బిచ్చి, గౌరవించి, పీఠాధిపతిగా చేసి వుండొచ్చు. గాని సైన్సు వ్యాపించేకొద్దీ ఛార్లస్ బ్రాడ్లా నిలబడతాడేగాని అనిబిసెంటుకాదు. మానవ వివేచనకు పదునుపెట్టే రీతులే ప్రజల్ని ముందుకు నడిపిస్తాయి. అనిబిసెంట్ మతపరమైన రచనలు చదువుతుంటే కావాలని అజ్ఞానాన్ని ప్రసాదంగా పంచిపెట్టినట్లనిపిస్తుంది. సామాన్యులలో దివ్యజ్ఞానం వ్యాపించకపోవడం కూడా వారి మంచికే అనవచ్చు.

- హేతువాది, ఆగష్టు 1989
పునర్వికాస పరిణామం
భారత ముస్లింలలో పునర్వికాసం
ఎందుకు రాలేదు?

ముస్లింలు భారతదేశంలో వందలాది సంవత్సరాలు పరిపాలించారు. దండెత్తి వచ్చిన వివిధ ముస్లింపాలకులకు దేశంలో ఎందరో సహాయపడ్డారు. ఇస్లాంలో కొందరు చేరిపోయారు. హిందూమతంలో లేని సమానత్వం ఇస్లాంలో లభిస్తుందని ఆశించారు. యూరోప్ లో చారిత్రక పాత్ర నిర్వహించి, గ్రీక్ , రోమన్ నాగరికతల్ని క్రైస్తవులకు అందించిన ముస్లింలు క్రమేణా తమ ఔన్నత్యాన్ని కోల్పోయారు. ఆ స్థితిలో వారు ఇండియాకు వచ్చారు. అసలే మత మౌఢ్యంలో కొట్టుకుంటున్న ఇండియాలో మరో మతాన్ని తెచ్చిపెట్టారు. బ్రిటిష్ వారు దేశపాలనను చేబట్టిన తరువాత కూడా ముస్లింలు తమ గతాన్ని మరచిపోలేక బాధపడుతూ వచ్చారు. మతాన్ని, సమాజాన్ని వేరుచేసి చూడలేని ముస్లింలు, అసహనాన్ని పెంచుకున్నారు. తమ కష్టాలన్నిటికీ హిందువులే కారణమని మతనాయకులు బోధిస్తుంటే, సామాన్య ముస్లింలు అసలు వాస్తవాల్ని పరిశీలించకుండా, గుడ్డిగా మతనాయకుల మాటల్ని నమ్ముకున్నారు. దేశంలో రానురాను ముస్లింలలో మత మౌఢ్యం విపరీతంగా పెరిగిపోయింది.