పుట:Abaddhala veta revised.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హేతువాదిగా, నాస్తికురాలుగా ఇంగ్లండ్ లో సంసర్కణలకు, స్త్రీల హక్కులకు పోరాడిన అనిబిసెంటు, ఇండియాలో మత ప్రభావంతో వెనక్కు నడవడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.

భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు తెల్లవారంటే చాలా అధికులనే భావం ప్రబలింది. వారు పరిపాలించడం ఒక కారణంకాగా, తెల్లచర్మం, ఇంగ్లీషు భాష, వేషం, భావాలు ఇతర కారణాలుగా పేర్కొనవచ్చు. 19వ శతాబ్దం చివరలో ఇండియాకు వచ్చిన అనిబిసెంటు తెల్లదొరసానిగా కొందరిని ఆశ్చర్యపరిస్తే, ఆమె ఉపన్యాసాలు, హిందూమతాన్ని పునరుద్ధరించాలనే ఆమె పిలుపు మరికొందరిని ఆకర్షించాయి. ఇది ఆసరాగా తీసుకొని అనిబిసెంటు ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. తాను పూర్వజన్మలో హిందువునే అన్నది. తమకు హిందూయిజాన్ని ప్రబోధిస్తున్న తెల్ల స్త్రీ పట్ల సనాతనులు కన్నెర్ర జేశారు. హిందూ సమాజాన్ని యధాతధంగా ఆమోదించిన అనిబిసెంటు, తరువాత హిందూ సమాజాన్ని సంస్కరించాలన్నది. ఇదిచూచి సంతోషించిన కొందరికి నిరాశే ఎదురైంది. ఆమె కావాలన్నది డిరోజియో-రామమోహన్ రాయ్ హిందూ సంస్కరణలుకాదు, ప్రాచీన హైందవాన్ని తిరగదోడాలని అనిబిసెంటు పిలుపు యిచ్చింది. ప్రాచీన హైందవం వికాసంతోనూ శక్తివంతంగా వున్నట్లు ఆమె అభిప్రాయపడింది.

1913 నాటికి అనిబిసెంటులో మానసిక వృద్ధాప్య లక్షణాలు స్ఫుటంగా కనిపించాయి. అగస్త్యుడితో తాను ప్రత్యక్ష సంబంధం పెట్టుకోగలుగుతున్నానని, అతడి కోరికపై కొన్ని సంస్కరణలు ప్రతిపాదిస్తున్నానన్నది. బాల్య వివాహాలను ఎదిరించమని అగస్త్యుడు చెప్పాడనీ, అందుకు ఒక దళాన్ని ఏర్పాటు చేయమన్నాడనీ రాసింది. ఇలాంటి భ్రమలు నిజమని ఆమె నమ్మిందో, లేక అమాయకులను నమ్మించదలచిందోగాని. యీ విషయాలు గ్రంధస్తం చేసింది.

దివ్యజ్ఞాన సమాజంవారు ఉపనిషత్తులు, గీత మొదలైన గ్రంథాలను దేశ, విదేశాలలో ప్రచారం చేశారు. క్రైస్తవులను, బైబిల్ ను వ్యతిరేకిస్తూ, హిందూ మతప్రాచీనతను పొగుడుతూ ప్రచారం సాగించారు.

భారతదేశంలో అనిబిసెంటు కేవలం మత ప్రచారంతో గాక, రాజకీయాలలో ప్రవేశించి, హోంరూల్ కావాలన్నది. ఇదికూడా ఆమెపట్ల ఆకర్షణకు మరో కారణంగా పేర్కొనవచ్చు. వృద్ధాప్యంలోబడిన అనిబిసెంటు తనకు వారసులు కావాలని, జిడ్డు కృష్ణమూర్తిని ఎంపిక చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన జిడ్డు నారాయణయ్య కుమారులను దత్తత స్వీకరించింది. కృష్ణమూర్తి, నిత్యానంద అనే యిరువురినీ అడయార్ దివ్యజ్ఞన సమాజంలో పెంచి, చదువు చెప్పించి, వారసుల్ని చేయ సంకల్పించింది. వారిని ఇంగ్లండ్ పంపి పై చదువులు చెప్పించింది. 1909లో స్వీకరించిన జిడ్డు కృష్ణమూర్తిని అడయార్ లో లెడబీటర్ ఆధ్వర్యాన అట్టిపెట్టారు. కృష్ణమూర్తి అందమైన కుర్రవాడు లెడీబీటర్ పెళ్ళికాని బిషప్. అతడు కృష్ణమూర్తి పట్ల ఆకర్షితుడై అక్రమ లైంగిక సంబంధానికి దిగాడు. ఈ వార్త దివ్యజ్ఞాన సమాజంలోనేగాక దేశమంతటా పొక్కింది.