పుట:Abaddhala veta revised.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యాగ్జాన్లు క్షణంలో మరోచోటకు చేరుస్తాయి. ఇదంతా విద్యుత్తు రసాయనిక చర్యగా సాగిపోతుంటుంది. న్యూరాన్ల మధ్య సంబంధాలకు అయోన్లు అనే అణువులు ఉపకరిస్తాయి. మెదడులో జరిగే యీ ఆలోచనా ప్రక్రియ మరో మెదడుకు తెలియాలంటే సంకేతాలు ఏదొక విధంగా బయట పడాలన్నమాట. టెలిపతి ప్రకారం ఆ సంకేతాలను గ్రహించిన వ్యక్తి, వాటి భావాన్ని బయటపెడతాడు. టెలిపతి ప్రకారం అవతల వ్యక్తి మెదడులో సంకేతాలను ఎలాగో తెలుసుకోవడమేగాక వాటి అర్థాన్ని విప్పి చెప్పగలగాలి. మెదడులో భిన్న భాగాలు భిన్న పనులు నిర్వహిస్తుండగా, టెలిపతి ప్రకారం వీటిని స్వీకరించడమేగాక,సమన్వయీకరించి, అర్థం చెప్పాలి కూడా. ఇది సాధ్యమా?

కొందరు పేరా సైకాలజిష్టులు యీ జటిల సమస్యలోని చిక్కుముడి విప్పడానికి ఒక పరిష్కారం కనుగొన్నారు. మెదడు నుండి సిట్రాన్స్ అనే కణాలు వస్తాయని(psitrons) వీటికి సాంద్రత, శక్తి వుండదనీ అన్నారు. క్వాంటం సిద్ధాంతం చెప్పే న్యూట్రినో(Neutrino) వంటివే సిట్రాన్లు అని సామ్యం చూపారు. కార్ల్ యూంగ్ వంటి సైకాలజిష్టులు యీ విషయంలో కోవు వేసుకున్నారు. సిట్రాన్ల సహాయంతో ఇతర మనస్సులలో జరిగే ప్రక్రియను తెలుసుకుంటున్నారన్నారు.

క్వాంటం ఫిజిక్స్ లో న్యూట్రినోలు అంచనాలకు,పరిశోధనలకు అందాయి. ఫలితాలు వచ్చాయి.

టెలిపతి చెప్పే సిట్రాన్ల వునికి యింత వరకు నిర్ధరణ కాలేదు. అదే ప్రధానమైన తేడా.

మెదడుపై ఆధినిక శాస్త్రం చేసిన పరిశోధనలు యింకా కొనసాగుతుండగా, యిప్పటి వరకూ తెలిసిన విషయాలు కొన్ని అంశాలని బయటపెట్టాయి.

మెదడు పనిచేసే తీరులో నాలుగు విధాలైన తరంగాలని కనుగొన్నారు. వీటిని గ్రహించడానికి ఎలక్ట్రో ఎన్ సిఫలో గ్రాఫ్ (EEG)తోడ్పడుతుంది.

ప్రతి సెకండ్ కూ మెదడులోని వివిధ తరంగ ప్రకంపనాల ప్రసారాలు భిన్న తీరుల్లో వుంటాయి.

మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు అల్ఫా తరంగాలు జనిస్తాయి.(Alpha rhymes)

మెదడు చురుకుగా పనిచేస్తుండగా బీటా(Beta) తరంగాలు ప్రకంపిస్తాయి.

నిద్రలో మెదడు డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది.

గాఢనిద్రలో తీటా(Theta) తరంగాలు వస్తాయి.

ఈ తరంగాలన్నీ సెకండుకు ప్రసరించే వేగాలలో మార్పు వుండగా, ఇఇజి పరికరం వాటిని చూపగలుగుతుంది. ఇవన్నీ వైద్యరంగానికి బాగా తీడ్పడతాయి. మూర్ఛరోగులకు చికిత్స యివి సహకరించాయి.