పుట:Abaddhala veta revised.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఇంద్రియాతీత శక్తులు-1

ఒక మనిషి మరో మనిషి మనస్సులోని ఆలోచనను చెప్పగలగడం ఒక విశేష శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో ఒకరుంటారు-ఇండియాలో మరో వ్యక్తి వుంటాడు. వారిరువురూ ఫోను సైతం చేసుకోరు. అయినా ఇండియాలో వున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఏమి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో అ విషయాన్ని అమెరికాలో వున్న వ్యక్తి చెబుతాడు. తరువాత పరిశీలీంచిన వారికి యిది అద్భుతంగా ఇంద్రియాతీతశక్తిగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు టెలిపతి (Telepathy) అని పేరు పెట్టారు. మరికొందరు యీ టెలిపతి శక్తి ద్వారా మరో వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగాను పనిచేయించగలడంటారు.

టెలిపతి అనేది సాధ్యమా కాదా అనే చర్చ సాగుతున్నది. కార్ల్ యూంగ్ (Carl Jung) వంటివారు దీనికి శాస్త్రీయ గౌరవాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నం చేశారు. జె.బి.రైన్ వంటివారు డ్యూక్ యూనివర్శిటీలో (అమెరికా) పరిశోధనలు చేసి ఫలితం కోసం తిప్పలు పడ్డారు. సోవియట్ యూనియన్ లో పరిశీలన తీవ్రస్థాయిలో జరిపారు. అయినా ఇంతవరకూ శాస్త్రీయ నిర్ధారణకు నిలిచే ప్రయోగం తేల్చలేదు. దూరాన వున్న మనుషుల్ని,వస్తువుల్ని తాకకుండానే ప్రభావితం చేయడం, మనస్సు బలంతో వస్తువుల్ని కదల్చడం, మొదలైన చర్యలు చేయవచ్చునని కొందరు భావించారు. ప్రదర్శనలు చేశారు. ఇలాంటి శక్తికి సైకోకెనిసిస్ అని పేరు పెట్టారు. ఇజ్రాయిల్ కు చెందిన యూరిగెల్లర్ చెంచాలని వంచడం, గాలిలో నుండి వస్తువుల్ని సృష్టించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అదంతా అతీంద్రియ శక్తిగా గెల్లర్ చాటుకున్నాడు. జోసెఫ్ బి.రైన్ కూడా సైకో కెనిసిస్ పై ప్రయోగాలు ఎన్నో చేశాడు. గైగర్ కౌంటర్ పరిశోధనలు జరిపాడు. రేడియో యాక్టివిటి విచ్ఛిన్నత ఆధారంగా ప్రయోగాలు ఎన్నో చూచాడు. ప్రిన్స్ తన్ యూనివర్శిటీ (అమెరికా)లో రాబర్ట్ జాన్ చాలా ప్రయోగాలు చేశాడు.

ఇంతవరకూ టెలిపతిలోగాని, సైకోకెనిసిస్ లోగాని శాస్త్రీయ పరిశోధనకు నిలిచేవి కనిపించలేదు.

గుర్రపు పందాలలో ఎవరు గెలుస్తారు,లాటరీ టిక్కెట్టులో దేనికి ప్రథమగెలుపు దక్కుతుంది అనేవి యీ శక్తుల ద్వారా ఎందుకు చెప్పలేకపోతున్నారనే విమర్శకు సమాధానం రావడం లేదు. అయినా నమ్మకస్తులు మొండిగా వీటిని ప్రచారం చేస్తూనే వున్నారు. టెలిపతి ప్రకారం ఒక వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండానే మరో వ్యక్తి మెదడులో ఆలోచనలు గ్రహించగలిగితే,మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనిషి మెదడులో సుమారు పది బిలియన్ల కణాలున్నాయి. వీటి పరస్పర సంబంధాలు జటిలంగా వుంటాయి. ఆలోచనలు, ఉద్వేగాలు, నిర్ణయాలు అన్నీ మెదడులో జనించి, ప్రసరిస్తాయి. ఈ కణాలు న్యూరాన్స్(Newrones) యాగ్జాన్స్(Axons) కు అతిచేరువగా వుంటాయి. కణాలిచ్చే సంకేతాలను