పుట:Abaddhala veta revised.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు దివాలా తీసి పారిపోయారు. కొత్త బాబాలు తలెత్తుతున్నారు. నిరంతరం జేమ్స్ రాండి పోరాటం సాగిస్తూనే వున్నాడు. మనం తీసుకెళ్ళిన కుంటి,గుడ్డి, మూగవాళ్ళను అక్కడ నయంచేయరు. వారు ముందే ఏర్పాటుచేసి, నటించేవారిని తెచ్చి నయమయినట్లు చూపి, డబ్బు కాజేస్తుంటారు.

జేమ్స్ రాండి తన Flim-Flam అనే గ్రంథంలో మరికొన్ని రంగాలలో మోసాలను బయటపెట్టి వివరాలందించాడు. ఆకాశం నుండి ఎగిరే పళ్ళాలలో వచ్చి కొందరు రోగాలను నయం చేస్తున్నారనే వదంతి ఎలా పనిచేస్తుందో చూపాడు. గాలిలో తేలిపోడానికి యోగవిద్య పనిచేస్తుందనే మహేష్ యోగి మోసాలను బయటపెట్టాడు. ప్రత్యామ్నాయ ఔషధాల పేరిట చికిత్సలు చేసి మోసాలు కప్పిపుచ్చుకుంటున్నవారి గుట్టి రట్టు చేశాడు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, దేవతల పేరిట అద్భుతాల వ్యాపార రహస్యం వెల్లడించాడు. జ్యోతిష్యాన్ని ఎండగట్టాడు. హోమియోను ఉతికేశాడు.

జేమ్స్ రాండి స్వయంగా మెజీషియన్. ప్రదర్శనలు యిస్తాడు. అయితే ఇతరులకూ యితనికీ తేడా వుంది. ప్రదర్శనలు కేవలం డబ్బుకోసం. ప్రేక్షకులకు వినోదం అందించడం. కాని మాజిక్ పేరిట మోసాలు చేయడాన్ని రాండి సహించడు.

సైంటిస్టులు అతి సులభంగా మాజిక్ వలలో పడతారని రాండి రాశాడు. సైన్స్ సూత్రాలను అతిక్రమించినట్లు మాజిక్ లో కనిపించే వాటిని సైంటిస్టులు గుడ్డిగా నమ్ముతారని అదేవారి లోపం అనీ అన్నాడు. అందుకే కొందరు సైంటిస్టులు బాబాల భక్తులై పోయి, మూఢ నమ్మకాల వ్యాప్తికి తోడ్పడుతున్నారన్నాడు.

మాజిక్ తెలిస్తే మోసాలను గ్రహించడం తేలిక. మూఢంగా నమ్మకం వుండదు. చదువుకున్న వారు సైతం మాజిక్ మోసాలు తెలియక బాబాల వలలో తేలికగా పడుతున్నారనాడు.

మాజిక్ ఎలా చేస్తారు, అందులో రహస్యం ఏమిటి, ప్రపంచంలో మాజిక్ ఎలా వ్యాప్తిలో వున్నదీ జేమ్స్ రాండి వివిధ రచనలలో విపులీకరించాడు. Conjuring అనే రచన ముఖ్యంగా చదవదగింది. కొందరు మెజీషియన్లు తమ విద్యని స్టేజికి పరిమితం చేయక, బాబాలుగా మారడంపట్ల రాండి ఆగ్రహించాడు. యూరిగెల్లర్ మోసాలను అలాగే బయటపెట్టాడు.

పేరా సైకాలజీ ఒక అంటివ్యాధిలా అమెరికా, యూరోప్‌లో, ఇతర చోట్ల వ్యాపించింది. కొందరు డిగ్రీలు కూడా పుచ్చుకుంటున్నారు. జె.బి.రైన్ మొదలు నేటివరకు పేరాసైకాలజి పేరిట జరుగుతున్న మోసాలని జేమ్స్ రాండి ఎదుర్కొన్నాడు.

- మిసిమి మాసపత్రిక, మే-2000