పుట:Abaddhala veta revised.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టెలిపతిలో పనిచేసే తీరు వివరించడానికి యీ పరికరం వాడిన(EEG)వారు, ఫలితాలను సాధించలేకపోయారు. సందేహవాదుల సమక్షంలో టెలిపతి పనిచేయదని మరికొందరు వాదించారు!

టెలిపతి రుజువు పరచడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఇంగ్లండ్ ఆర్థర్ కోస్లర్ 1985లో ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో ఒక కేంద్రం నెలకొల్పారు.

ఎక్కడైనా ఒక విద్యార్థి అనూహ్య ప్రతిభను చూపినప్పుడు అదంతా టెలిపతి వల్లనే అనడం ఆనవాయితీ అయింది. ఎక్కడా టెలిపతి శాస్త్రీయ పరిశోధనకు నిలవలేదు.

సైకో కెనిసిస్ వాదులు రేడియో సంకేతాల సామ్యం చూపుతూ,అలాంటి "ఆలోచనా సంకేతాలు" దూరానవున్న వస్తువులపై ప్రభావం చూపుతాయన్నారు. రేడియో సిగ్నల్స్ సమాచారాన్నందిస్తాయి. వాటి వలన వస్తువులు కదలవు,చెంచాలు వంగవు. విద్యుదయస్కాంత రేడియేషన్ వంటిది ఆలోచనా తరంగాలలో వుంటే, అదెక్కడా రుజువుకు నిలబడలేదు. రుజువుకు అతీతమైనదని టెలికెనిసిస్ వాదులు అంటే అది వారి మూఢ నమ్మకాన్ని సూచిస్తుంది.

పేరా సైకాలజీ నిపుణుడుగా పేరొందిన జె.బి.రైన్ అమెరికాలోని నార్త్ కెరోలైనా రాష్ట్ర డ్యూక్ యూనివర్శిటీలో 1930 నాటికి ఒక శాఖను స్థాపించాడు. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేసి,పేరా సైకాలజీకి గౌరవాన్ని ఆపాదించే ప్రయత్నంలో ఆయన వేలాది పరిశోధనలు చేశాడు. అందులో పేక ముక్కల వంటి కార్డులను ప్రయోగించి,కార్డులలో ఏముందో ఎటువైపు అవి కనిపిస్తాయో అనే అంశం పరిశీలించాడు. అలాగే చదరంగంలో పావులు కూడా వినియోగించాడు. నాణాలు ఎగరవేస్తే తల,తోక(బొమ్మబొరుసు) ఎటుపడతాయో లెక్కలు కట్టాడు.

1934లో లాంగ్ మూర్ అనే నోబెల్ ఫ్రైజ్ గ్రహీత వెళ్ళి జె.బి.రైన్ పరిశోధనల్ని శ్రద్ధగా తిలకించాడు. పరిశీలకులు తమను తామే వంచించుకుంటున్నారని, లేని వాటికోసం వెతుకుతున్నారని,అదంతా దయనీయమైన స్థితిగా వున్నదని అన్నాడు. తన అభిప్రాయాన్ని జె.బి.రైన్ కు చెబితే, అతడు ఆశ్చర్యపడక పోగా, ఇర్వింగ్ లాంగ్ మూర్ అభిప్రాయాల్ని బయటపెట్టమని కోరాడు. తద్వారా తనకు ప్రచారం లభిస్తుందన్నాడు.

జె.బి.రైన్ తన పరిశోధనలలో పాల్గొన్న వారు కొందరు కావాలని తప్పుడు అంచనాలు వేస్తున్నా,వాటిని రైన్ బయట పెట్టకుండా దాచినట్లు లాంగ్ మూర్ కనుగొన్నాడు. తనంటే యిష్టం లేనివారు అలా తప్పుడు అంచనాలు వేశారు గనుక వారి లెక్కల్ని చేర్చలేదని రైన్ అన్నాడు. తప్పుడు అంచనాలు వేస్తున్నారని రైన్ కు ఎలా తెలుసు? లెక్కల్లో కొన్ని మరీ తక్కువ అంచనాలు చూపడమే.

లాంగ్ మూర్ అనే సైంటిస్టు పేరా సైకాలజీలో ఆసక్తి కనబరచాడనే ప్రచారం చేశారు తప్ప, అతను ఖండించిన రైన్ పరిశోధనల్ని బయట పెట్టలేదు?