పుట:Abaddhala veta revised.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

19వ శతాబ్దంలో వచ్చిన రెండు సంస్కరణ ఉద్యమాలు జాతీయవాదులను ప్రభావితం చేశాయి. బ్రహ్మసమాజ్ మితవాదులను ఆకట్టుకున్నది. జాతీయ అతివాదులు ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితులై విజృంభించారు. లజపతిరాయ్ ఇందులో అగ్రస్థానం వహించగా, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సావర్కార్ లలో వివిధ రూపాలుగా వెల్లడైంది. కాంగ్రెసు పార్టీలో వీరు ఉగ్రవాదాన్ని ప్రబలింపజేశారు. వీరంతా మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. దయానంద్ వ్యక్తపరచిన ముస్లిం వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్నారు. అది చిలవలు పలవలుగా పెరిగి తీవ్ర పరిణామాలకు దారితీసింది. సెక్యులర్ ధోరణి రాకుండా అడ్డుకట్ట వేసింది. "హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘలు ఉత్తరోత్తరా బయలుదేరి ద్వేషాల్ని రెచ్చగొట్టాయి. దీనికి మారుగా ముస్లింలీగ్, తదితర ముస్లిం మతసంస్థలు కూడా వేర్పాటువాదానికి దారితీశాయి. ముస్లింలు పరిపాలించిన, మతం మార్చిన చోట, ముఖ్యంగా పంజాబ్, నైజాం, హైదరాబాద్ లో ఆర్యసమాజ్ తన పాత్ర వహించింది. మిగిలిన చోట్ల ఆర్యసమాజ్ ప్రభావం నామమాత్రమే.

వేదాల్లో ఏముంది?

దయానందుడు ఆర్యసమాజ్ పెట్టి, హిందువులందరినీ వేదాల్లోకి నడిపించదలచాడు. మిగిలిన వాటినన్నీ కాదని, వేదాలు పట్టుకోడానికి అందులో ఏముంది? వేదాలు ప్రాచీనకాలంలో ఎందరో ఆలోచిస్తూ, ఆడుతూ, పాడుతూ, కంఠస్తం చేసిన విషయాలే. అవి సంప్రదాయబద్ధంగా విన్నంత , జ్ఞాపకమున్నంత ప్రచారంలోకి వచ్చాయి. ఎ ఒక్కరూ ఏర్చి కూర్చినవి కావు గనుక, మూల రచయిత ఎవరూ లేరు. రానురాను వీటికి దివ్యత్వాన్ని అంటగట్టారు. అపౌరుషేయాలన్నారు. ప్రమాణం అన్నారు. సుమారుగ చెప్పడం తప్స వేదాలు ఎప్పుడు బయటపడ్డాయో కాలనిర్ణయం కూడా ఖచ్చితంగా లేదు.

వేదాలలో ప్రార్ధనలన్నీ దేవుళ్ళను, దేవతలను, ప్రకృతిని ఉద్దేశించినవే. ఆరోగ్యం, సంపద, దీర్ఘకాలిక జీవనం, ధైర్యసాహసాలు, గెలుపు, వర్షాలు, పంటలు, బంగారం, కీర్తి మొదలైనవి కావాలని ప్రార్థనల సారాంశం. ఇదంతా ఆదిమ మానవుడి మనస్తత్వాన్ని సూచిస్తుంది. కార్యకారణవాదంలో ఆనాడు ప్రతిదానికి దేవుళ్ళు కారణం అనుకొని ప్రార్ధించారు. వేదాలలో చాలామంది దేవుళ్ళున్నారు. ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు మొదలైనవారు గద్దెనెక్కుతూ దిగుతూ, ప్రజేచ్చ ప్రకారం మారారు! మానవులు తమ లక్షణాలను, బలహీనతలను దేవుళ్ళకు అంటి తమలో లేని శక్తిని దైవానికి ఆపాదించారు. అలాంటప్పుడు చేసిన ప్రార్థనలలో అందమైన ఆకర్షణ పూరిత మంత్రాలు, శ్లోకాలు వున్నాయి.ఇది ఉద్వేగానికి సంబంధించిన విషయం. ఏకేశ్వరారాధన, బహుదేవతారాధన, ఏకశక్తి వూహ యిత్యాదులన్నీ వేదాలలో కనిపిస్తాయి. ఉత్తరోత్తరా పెంపొందిన దర్శనాలు,పురాణాలు, స్మృతులు అన్నీ వేదాలనే ప్రమాణంగా ఉదహరించడానికి యింత భిన్నత్వం, వైవిధ్యమే కారణం.