పుట:Abaddhala veta revised.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దయానందుడు ప్రచారం చేశాడు. హిందువులుగా వున్నవారు ఇతర మతాలలోకి మారరాదని, అప్పటికే మారినవారు, శుద్ధిపొంది, తిరిగి మాతృసంస్థలోకి రావచ్చునని దయానంద ఉద్బోధించారు.

దయానందుడు ఉపనిషత్తులతో సహా, వేదేతరమైన వాటికి శ్రుతి ప్రమాణాన్ని కాదనడం సాహసమే. బృహదారణ్యకోపనిషత్తులో దుర్భరమైన విషయాలున్నాయని (స్త్రీ పురుషుల లైంగిక ఆకర్షణ వంటివి) అలాంటి వాటికి శ్రుతి ప్రమాణం ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించాడు. అయితే వేదాలలో కూడా అంతకంటె దారుణ విషయాలు వున్నాయిగదా అవెలా సహిస్తావంటే, వేదాలలో విషయాలను గౌణఅర్థంలో చూడాలన్నారు. అంటే పైకి కనిపించే వాటికి నిగూఢమైన సూచనార్థం వుంటుదన్నారు. ఉపనిషత్తులను కూడా అలాంటి గౌణ(metaphorical) అర్థంలో చూడొచ్చుగదా అంటే, వీల్లేదన్నారు. నమ్మకాలకు తర్కం వుండదు. సహేతుకత వుండదు.

ఆర్యసమాజవాదులు ముఖ్యంగా దయానందుడు వేదాలలో సైతం కొన్నిచోట్ల మార్పులు చేశారు. తమ వాదనకు అనుకూలంగా వుండేట్లు ఉదాహరణకు కాలం గురించి వేదం ఏం చెబుతున్నది? కాలాన్ని కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలుగా విభజించారు. కృతయుగం స్వర్ణయుగమన్నారు. తరువాత స్థాయిలో త్రేతాయుగం వున్నది. ద్వాపరలో పతనం మొదలైంది. ఇక కలియుగం పతనానికి, అవినీతికి నిలయం అన్నారు. యుగాంతంలో అంతా భగవంతునిలో లీనమై మళ్ళి కాలచక్రం కృతయుగంతో మొదలవుతుంది. ఇలాంటి కాలవిభజన ఎటువంటి పరిశీలనకూ నిలవదు.

సాపేక్షతా సిద్దాంత పరంగా వస్తున్న కాలానికీ, వేదాలలో ఆధారాలు లేని కాలానికీ సంబంధం లేదు. వేదకాలం కేవలం నమ్మకాలపై అంధవిశ్వాసాలపై వున్నది కనుక దయానందుడు మనల్ని అలాంటి కాలచక్రాన్ని నమ్మమంటే ఎలా వీలవుతుంది? వేదాల్లోకి పోవడమంటే వెనక్కు వెళ్ళి అంధకారంలో చిక్కుకుపోవడమే.

దయానందుడు హైందవ మతంలో అతివాదిగా జాతీయవాదులకు వీరత్వాన్ని ప్రసాదించి పెట్టాడు. క్రైస్తవం, ఇస్లాం కంటె హిందూమతం గొప్పదన్నాడు. ప్రపంచమంతా హిందూమతం వ్యాపించాలని, అందరినీ హిందువులుగా మార్చవచ్చుననీ ఆశించాడు. దయానంద భావాలను ఆచరణలోకి తేవడానికి లాలా మున్షీరామ్, లాలా హన్సరాజ్, లాలాలజపతిరాయ్, రామదేవ మొదలైనవారు కృషిచేశారు. ఆధునిక విజ్ఞానశాస్త్రంలోని మూల విషయాలన్నీ వేదాలలోనే వున్నాయని, రైళ్లు,విమానాల వంటివాటికి కూడా ఆనాడే బీజాంకురాలు పడ్డాయని దయానంద్ అభిప్రాయపడ్డాడు. సంఘాన్ని సంస్కరించాలని తలపెట్టిన దయానంద్, వేదాల ఆధారంగా అంటరానితనాన్ని తిరస్కరించాడు. వంశపారంపర్యంగా వచ్చే కులానికి వేదాలలో చోటులేదన్నాడు. అయితే ప్రతిభ ఆధారంగా వర్ణవ్యవస్థ వున్నదన్నాడు. బహుభార్యాత్వం కూడదన్నాడు. విగ్రహారాధన తప్పు అన్నాడు. వేదాలలో సంహిత మంత్రభాగం అంతా దోషరహితమని దయానందుడి ఉద్దేశ్యం.