పుట:Abaddhala veta revised.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దయానందుడు కులాన్ని కాదన్నా, వేదాల్లోని వర్ణవ్యవస్థను అంగీకరించాడు. ఈ వర్ణాలే కులపద్ధతికి మూలం. వేద మతాచారాలను ఉల్లంఘించిన శుాద్రులకు మరణదండన విధించిన స్మృతులు వేదోక్తంగానే చేశాయి.

వేదాలలో నరబలి అంగీకరించారు. (తర్కతీర్థ లక్ష్మణశాస్త్రిజ్యోషి-ఎ క్రిటిక్ ఆఫ్ హిందూయిజం,పుట 102) ఈ ఆచారాన్ని బ్రిటిష్ పాలకులు నిషేధించారు. బహుళ ప్రచారం పొందినట్లు ఆధారాలు లేవుగాని, ఆర్యులు నరబలి యిచ్చి సంపద పెంచుకోడానికి అది తోడ్పడుతుందని నమ్మినట్లు ఆధారాలున్నాయి.

రుగ్వేదంలోనే వర్ణాల ప్రసక్తి వున్నది. బ్రాహ్మణ, క్షత్రియ ప్రస్తావన వున్నది. ఆర్యులు, దస్యులు(బానిసలు)అని పేర్కొన్నారు. ఆర్యులే మొట్టమొదట దండెత్తి వచ్చి, వర్ణాలను సృష్టించారు. ఆధిపత్యం వహించిన ఆర్యులలో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలు వచ్చాయి. వీరే సమాజంపై పెత్తనం చేశారు. వీరందరికీ సేవలు చేసేవారిని శూద్రులు అన్నారు. వేదయజ్ఞం చేసే అర్హత శూద్రులకు లేదు. సమాజంలో 75 శాతం ప్రజల శ్రమను అగ్రవర్ణాలవారు ఆనాటి నుండి దోపిడీ చేస్తూ, వస్తున్నారు. ఈ వేద వర్ణవ్యవస్థను దయానందుడు సమర్ధించాడు. అక్కడికి పోదామంటాడు. శూద్రుడు పితికిన పాలు కూడా అపవిత్రమన్న వేదంలోకి మనల్ని తీసుకెళ్ళాలని దయానందుడు ఉద్దేశించాడు. దయానందుడు ఎంత సంస్కరణవాది అయినా, పుట్టింది, పెరిగింది అగ్రవర్ణమైన బ్రాహ్మణకులంలోనే. ఆయన నేర్చిన విద్య కూడా బ్రాహ్మణాధిపత్యాన్ని ఆపాదించేదే.

వేదకాలంలోనే బ్రాహ్మణాధిపత్యంపై క్షత్రియుల తిరుగుబాటుకు ఆధారాలున్నాయి. బ్రాహ్మణులు శూద్ర స్త్రీతో వ్యభిచరించ వచ్చును. ఆ పని శూద్రుడు గనుక బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు, జుగుప్సాకర విషయాలు వేదాలలో వున్నాయి. వాటికి ఆసరాగా స్మృతులు వెలువడ్డాయి. గౌతమ, వశిష్ట, ఆపస్తంబ, మనువు, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి, శంఖలిఖిత స్మృతులలో మానవులను నాలుగు కులాలుగా చీల్చి అమానుష నియమాలు చూపారు.

వేదకాలంలోని యజ్ఞాలకు,జంతుబలులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. బౌద్ధవిప్లవం అందుకు ఒక ఉదాహరణ. వేదకాలంలోని అమానుషత్వాన్ని చార్వాకుడు బయటపెట్టాడు. మత అసహనం ఆనాటినుండే ప్రబలింది. చార్వాకుడిని తిట్టడానికి అతడి రచనల్ని ఉదహరిస్తే అవే నేడు మనకు ఆధారాలయ్యాయి. అంతకు మించి అతడు పూర్తిగా ఏమి రాశాడో లభించకుండా నాశనం చేశారు. అలాంటి వేదకాలంలోకి దయానందుడు మనల్ని పొమ్మంటున్నాడు.

వేదాలలో తన వాదనకు అనుకూలమైన వాటినే దయానందుడు స్వీకరించాడు.