పుట:Abaddhala veta revised.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12వ పయస్ పోప్ చరిత్రమలుపు తిప్పిన వ్యక్తి. అతడు మరొక రుషి అని నేటి పోప్ ప్రకటించాలనుకుంటున్నాడు. దీనికి కార్యక్రమం మొదలైంది.

12వ వయస్ పోప్ ఇటలీలో యూజివో కుటుంబీకుడు. 1876లో పుట్టిన యూజినో పచెలి చాలాభాషలు ధారాళంగా మాట్లాడేవాడు. వాటికన్ రాజకీయాలలో చాలా ప్రాధాన్యత వహించిన పచెలి, యూదు వ్యతిరేకి. వాటికన్ నిర్ణయాలలో ఇతడు అతిప్రముఖపాత్ర నిర్వహించాడు.

హిట్లర్ తో చెట్టపట్టాలు.

పోప్ గా ఎన్నికకాకముందే యూజినోపచెలి వాటికన్ ప్రతినిధిగా జర్మనీ రాజకీయాలలో నాటకాలాడాడు. అధికారానికి వస్తున్న హిట్లర్ తో జర్మన్ కేథలిక్కులు ఒడంబడిక కుదుర్చుకోడానికి యితడే కారకుడు. జర్మనీలో కేథలిక్కులకు విద్యా, వైద్య తదితర సౌకర్యాలు, ప్రచార అనుకూలతలు యివ్వడానికి హిట్లర్ అంగీకరించాడు. దీనికి బదులుగా హిట్లర్ కు వ్యతిరేకత లేకుండా జర్మనీలో కేథలిక్ రాజకీయ పార్టీని పార్లమెంటునుండి వైదొలగేటట్లు యూజినో పచెలి ఒప్పించాడు.

ఇంతటితో హిట్లర్ కు ప్రధాన ఆటంకం తొలగింది. నియంతృత్వాన్ని చట్టబద్ధం చేయడానికి హిట్లర్ కు యూజినో పచెలి బాగా తోడ్పడ్డాడు. ఇది 1933లో జరిగిన ఉదంతం. నాజీ నియంతృత్వానికి ఇలా మద్దత్తు యిచ్చిన కేథలిక్కులకు యూజినో పచెలి నాయకుడు. ఉత్తరోత్తరా యితడే పోప్ అయ్యాడు.

1939లో యూజినో పచెలి పోప్ గా ఎన్నికయ్యాడు. హిట్లర్ కు మరింత కలసివచ్చింది! యూదులను హతమార్చడానికి హిట్లర్ వేసిన పధకాలకు కొత్త పోప్ పరోక్షదీవెనలు లభించాయి.

అంతకు ముందు చనిపోయిన పోప్ హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రకటన యివ్వాలనుకున్నాడు. తగినంత సమాచారంతో అలాంటి ప్రకటన జారీచేయబోతుండగా 11వ పయస్ చనిపోయాడు. వెంటనే ప్రకటన స్వాధీనం చేసుకున్న 12వ పయస్ పచెలి మళ్ళీ దానిని వెలుగుచూడనివ్వలేదు.

యూదులను మట్టుబెడుతున్న హిట్లర్ కు వ్యతిరేకంగా గాని, ఫాసిస్టు నియంత ముసోలినీకి విరుద్ధంగా గాని పోప్ మాట్లాడలేదు. ఆనాడు పోప్ వ్యతిరేకించివుంటే యూదులు అలా హతమయ్యేవారుకాదు. అయితే పోప్ కూడా యూదుల వ్యతిరేకిగదా. మానవహక్కుల గొడవ వారికి పట్టదు. దైవహక్కుల పేరిట మానవుల్ని చంపడం వారిలీల! దీనిపై ప్రపంచంలో తీవ్ర విమర్శ వచ్చింది. పొప్ దుర్మార్గ ప్రవర్తన ఖండనకు గురైంది.

పోప్ 12వ పయస్ తన దర్శనార్ధం వచ్చిన సుప్రసిద్ధ బ్రిటిష్ కవి టి.ఎస్. ఇలియట్ సాహిత్యంపై బోధచేశాడు. ఫ్రాన్స్ లో కేథలిక్ మేధావి టైల్ డి షార్డిన పరిణామాన్ని గురించి రాజీపడగా పొప్ అతడ్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతడు అమెరికా ప్రవాసం పోవలసి వచ్చింది. అలా శిష్యుల్ని కూడా కాలరాచారు.