పుట:Abaddhala veta revised.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16వ శతాబ్దంలో ఫ్రెంచి వ్యక్తి నోస్ట్రాడాముస్ (1503-1566) శతాబ్దాలు అనే గ్రంథం (Centuries) రాశాడు. ఇది 10 భాగాలు. ఇందులో అన్ని భవిష్యత్తువాణి అన్నాడు. ఇప్పటికి వాటిని నమ్మేవారున్నారు. అతడు ఒకటవ ఎలిజబెత్ రాణి గురించి చెప్పింది ఒక్కటీ నిజం కాలేదు. అతడు 10వ భాగంలో చెప్పిన ప్రకారం 1999 జూలైలో ప్రపంచం అంతం కావాలి. జేమ్స్ రాండి దీనిపై వ్యాఖ్యానిస్తూ అంతా అబద్ధాలమయంగా వున్నా ఆ 10 భాగాల రచనల్ని భక్తులు విపరీతార్థాలతో జనాన్ని భయపెడుతున్నారన్నాడు.

తోకచుక్కల విషయం శాస్త్రీయంగా బొత్తిగా తెలియక దాని చుట్టూ అనేక ప్రళయ కథలు అల్లారన్నాడు.

సంఖ్యాశాస్త్రంలో, నేడు కంప్యూటర్లు వాడి తప్పుడు భాష్యాలు చెప్పడాన్ని చూపాడు. అలాగే పిరమిడ్లను అడ్డం పెట్టుకొని కొందరు కథలు అల్లడాన్ని చూపాడు రాండి.

అద్యంతాలు ఆసక్తికరంగా రాసిన యీ ఎన్‌సైక్లోపీడియా లైబ్రరీలలో వుండాలి. పిల్లలు చదవాలి. తల్లిదండ్రులు చదివి పిల్లల భయాలను పోగొట్టాలి. అసిమోన్ చెప్పినట్లు పిల్లలందరూ సందేహవాదులే. వారు ప్రతిదీ ప్రశ్నిస్తారు. కాని ఆ ప్రశ్నా స్వభావాన్ని తల్లిదండ్రులు మతాలు చంపేస్తున్నాయి.

5 కోట్లు గెలవండి

జేమ్స్ రాండి 70వ పడిలో మూఢ నమ్మకాలపై నిరంతర పోరాటం సాగిస్తూ, బ్యాంకులో 10 లక్షల డాలర్లు పెట్టాడు.

ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా సరే సైకిక్, అతీంద్రియ (ఇంద్రియాతీత) శక్తులున్నాయని రుజువుపరచి, ఆ డబ్బు స్వీకరించవచ్చు.

జేమ్స్ రాండి అడ్రసు: 201 East, Davie Boulevard(S.E. 12th St), Fort Lauderdale, Florida 33316-1815

ఈ నిర్ణయంలో జడ్జిగా జేమ్స్ రాండి వుండడు.

ముందుగానే చెక్కును నిష్పక్షపాతి వద్ద అట్టిపెడతాడు.

ఏ శక్తి వున్నదీ ముందుగా తెలియపరచాలి.

నిర్ణయించిన తేదీ, స్థలం ప్రకారం, పేర్కొన్న శక్తి ప్రదర్శన జరగాలి. ప్రదర్శన అంతా ఫోటో తీయడం, రికార్డు చేయడం జరుగుతుంది.