పుట:Abaddhala veta revised.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షి మహేష్ యోగి గురించి యిందులో క్లుప్తంగా చెప్పినా, అతడి మోసాలను మరో గ్రంథంలో చాలా వివరంగా బట్టబయలు చేశాడు.

(Flim-Flamలో The Giggling Guru:A matter of Levity చూడండి. Prometheus Books,700 East Amherst street Buffalo, Ny 14215 USA PP 342 దీనికి ఐజక్ అసిమోవ్ పీఠిక రాశాడు).

భారతదేశంలో మహిమల గుట్టును శాస్త్రీయంగా వెల్లడిస్తున్న, బి. ప్రేమానంద్ గురించి యీ పుస్తకంలో వుండడం విశేషం. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రేమానంద్ తమిళనాడులోని పోడునూరు, కోయంబత్తూరు నుండి ఇండియన్ స్కెప్టిక్ అనే ఇంగ్లీషు మాసపత్రిక నడుపుతున్నారు.

జ్యోతిష్యం భవిష్యత్తును చెబుతున్నా, కంబోడియా జ్యోతిష్యం రానున్న ఉపద్రవం అరికడతానని కూడా అంటుందని రాశాడు.

భారతీయులకు సంబంధించి జిడ్డు కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజ పరిస్థితి ఉదహరించాడు.

కుండలినియోగం, చక్రం, ఫకీర్, గురువు, హరేకృష్ణ, కర్మ, కమండలాలు, మంత్రం, ఓం, సాయిబాబా, సిద్ధి, తంత్ర, యోగం, ప్రస్తావనలు వున్నాయి.

భారతీయులకు తెలియని విదేశీ విషయాలు చాలా వున్నాయి. కొన్ని మాత్రం మనదేశంలో వున్నట్లే ఇతర దేశాలలో మార్పులు చేర్పులతో వున్నాయి. అందుకు ఉదాహరణగా దానంతట అదే, చేయి రాస్తూ పోతుందనడం, హస్త సాముద్రికం (కొందరు అరికాలిలో గీతలు కూడా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు). జ్యోతిష్యం, నిప్పులపై నడక, గాలిలో తేలడం, దూరశ్రవణ,దూరదృష్టి, ముఖ కవళకల్ని బట్టి వ్యక్తి ఎలాంటివాడో చెప్పగలగడం, దృష్టిదోషం, చేతబడి, దివ్యశక్తితో, నీళ్ళు ఆయిల్ ఎక్కడపడేది చెప్పడం వున్నాయి.

ప్రపంచం అంతం

జేమ్స్ రాండి పేర్కొన్న 49 ప్రపంచ అంతం జోస్యాలు చాలా ఆసక్తికరమైనవి. బైబిల్ ఉదాహరణలు, క్రైస్తవ జ్యోతిష్యుల అంచనాలు యిచ్చి అవి ఎలా వెర్రివాళ్ళను చేసాయో చూపాడు.

క్రీ.శ. 992 లో మొదలుపెట్టి 1999 జూలై వరకూ చెప్పిన ప్రళయ జోస్యాలు రాండి పేర్కొని, విఫలం అయిన తరువాత కూడా జ్యోతిష్యులు తలెత్తుక తిరుగుతున్నారన్నాడు. జోస్యాలు చెప్పిన వారిలో బిషప్పులు కూడా వున్నారు.

(శ్రీశ్రీ మాటలు గుర్తు తెచ్చుకోండి - హిప్పొపొటమస్ ఒక బిషప్పును గనియిట్లనియె స్వామీ తమరు చెప్పిందే చెప్పిందే మరల మరల చెప్పుటెందులకని)