పుట:Abaddhala veta revised.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అలాంటి శంకర ఆశ్రమాలలో స్మార్త బ్రాహ్మణులే వంటలు చేయాలని నేటికీ కట్టుదిట్టాలు పాటిస్తున్నారు. తల్లి అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా అనుసరిస్తున్నాడు.

అంటరానితనం పాటిస్తున్నారంటూ మంత్రాలయం (కర్నూలు) గురించి మొత్తుకున్న మసాల ఈరన్నపై రాఘవేంద్రస్వామి ఆలయాధిపతులు కేసులుపెట్టి వేధిస్తే కాంగ్రెసువారు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. చివరకు ఇందిరాగాంధీ పాలనలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు భావించిన జగజీవన్ రామ్ కూడా కాంగ్రేసునుండి బయటపడిపోవాల్సి వచ్చింది. హరిజనుల పట్ల మొసలి కన్నీటితో కాంగ్రెసుపార్టీ, వారిని భ్రమలో అట్టిపెడుతూ వస్తున్నది. ఆచరణలో మాత్రం శాస్త్రాలను, మఠాలను సమర్ధిస్తూ, అగ్రకులాన్ని కొమ్ముకాస్తున్నది.

అంటరానితనం తొలగించడానికి కాంగ్రెసు నాడూ నేడూ చిత్తశుద్ధిని చూపలేదు. నేటికీ ఓట్లకై అంటరానివారిపట్ల ప్రేమ ఒలకబోసి మోసం చేస్తున్నది. కాంగ్రెసుపార్టీ నిర్వాకం అలాగున్నది. పదవులకోసం కొందరు కాంగ్రేసులోవుంటూ అంటరానివారిపట్ల తీవ్రద్రోహం చేస్తూ, అంబేద్కర్ ఉద్యమాన్ని ఉరితీస్తున్నారు. ఈ విషయం వారికి తెలియకకాదు. తాత్కాలిక ప్రయోజనం, స్వార్ధం దృష్ట్యా అలా చేస్తున్నారు.

భారతీయ జనతాపార్టీ - అంబేద్కర్

అంబేద్కర్ కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. భారతీయ జనతాపార్టీ ఇటీవల ఒకనాట గాంధీజీని, మరోనోట అంబేద్కర్ ను పొగుడుతూ, వారి ఆశయాలను ఆచరిస్తామంటున్నది. ఒకే వేదికపై గాంధీజీని, అంబేద్కర్ ను చేర్చారంటేనే బిజెపిని శంకించవలసి వస్తున్నది. గాంధీజీని కొత్తగా గుత్తకు తీసుకున్న బి.జె.పి. తమ ఎత్తుగడలో అంబేద్కర్ ని కూడా చేర్చడం గమనార్హం.కాని యీ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్ లో బి.జె.పి ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు. కేవలం ఓట్ల కోసమే, కాంగ్రెసువారి వలె, బి.జె.పి కూడా అంబేద్కర్ ను శ్లాఘిస్తున్నా, అది మరీ కృత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. అయినా, బి.జె.పి నీతికి తానే పట్టం గట్టినట్లు పేర్కొంటున్నందున్నవారి విషయం పరిశీలించవలసి వుంది.

ఇటీవలే బి.జె.పి. వారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికై కంకణం కట్టుకున్నారు. రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బి.జె.పి కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారుకూడా. అదంతా మతకలహాలకు దారితీసింది. కాని అంబేద్కర్ ను పొగుడుతూ, ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బి.జె.పి వారికి అసలు విషయం తెలియదనుకోలేం గదా! అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు. వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని-రామాయణాన్ని గురించి అంబేద్కర్ రాసింది వారి దృష్టికి వచ్చే వుంటుంది.