పుట:Abaddhala veta revised.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మద్దత్తును ఉపసంహరించింది. గాంధీజీ కాంగ్రెసును వెనుకేసుకొచ్చారే గాని, అంటరానివారిని కాదు. హరిజన సేవాసంఘం పక్షాన హక్కుల పోరాటానికి గాంధీజీ ఎన్నడూ అనుమతించలేదు. పైగా హరిజన సేవాసంఘ యాజమాన్యంలో హరిజనుల్ని గాంధీజీ తొలగించారు! పూనా ఒడంబడిక తరువాత అంటరానివారికి కేటాయించిన స్థానాలలో వారిపై పోటీపెట్టవద్దని కాంగ్రెసుకు గాంధీజీ ఎన్నడూ సలహా యివ్వలేదు. కాంగ్రెసు మంత్రివర్గాలలో అంటరానివారికి ప్రాతినిధ్యం వుండాలని గాంధీజీ ఎన్నడో పట్టుబట్టలేదు. పైగా మధ్య పరగణాలలోని మంత్రిమండలిలో అగ్నిభోజ్ అనే అంటరాని ప్రతినిధి నియామకాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు.

గాంధీజీ అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపాడు. అలాగే కాంగ్రెసువారి చర్యల్ని వస్త్రకాయంపట్టి వారి విద్రోహచర్యల్ని బట్టబయలు చేశాడు. కనుక వీటికి సమాధానం కాంగ్రెసువారే చెప్పాలి. లేదా, గాంధీజీని, స్వాతంత్ర్యానికి ముందున్న కాంగ్రెసును పూర్తిగా ఖండించాలి. తాము కొత్త అవతారం ఎత్తామని చూపాలి. అది సాధ్యమా? ఆచరణలో కాంగ్రెసువారు ఎలా వున్నారు? అదీ పరిశీలిద్దాం.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన హిందూ కోడ్ బిల్లును సనాతన హిందువులు వ్యతిరేకించారు. జవహర్ లాల్ నెహ్రూ 'పైకి' సెక్యులర్, అభ్యుదయవాదిగా వున్నా ఎన్నికల సమయానికి సనాతనులకు లొంగిపోయాడు. ఫలితంగా అంబేద్కర్ నెహ్రూ మంత్రిమండలి నుండి రాజీనామాచేసి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత అంబేద్కర్ అంటరానివారి విమోచనకై ఉద్యమించి, "హిందువులలో వున్నంతకాలం వారికి సమానత్వం రావడానికి వీల్లే"దని గ్రహించి, బౌద్ధంలో చేరాడు, చేర్పించాడు. అంటరానివారిపట్ల ప్రేమ నటించిన కాంగ్రెసువారు, అంతవరకూవున్న సౌకర్యాలను, ప్రత్యేక కేటాయింపులను అంబేద్కర్ అనుచరులకు లేకుండా చేశారు. జనతా ప్రభుత్వంలోగాని మళ్ళీ వారి హక్కులు పునరుద్దణ కాలేదు!

అంటరానివారికి, శూద్రులకు ప్రత్యేక ఆహారంగావున్నా ఆవు మాంసం కూడా నిషేధించడానికి వినోబాభావే పూనుకున్నాడు. ఆందోళన జరిగింది. గోవును చంపడం మతపరంగా పాపం అంటూ చిత్రీకరించి, ఆందోళనచేసి, వత్తిడితెచ్చి నిషేధ శాసనాలు చేయించారు. దీనికి కాంగ్రెసు మద్దత్తు వున్నది. ఆహారం ఏది తినరాదో శాసించే స్థితికి పోయారంటే, నియంతృత్వ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. అడుగడుగునా వినోబాభావే ఆశీస్సులకోసం ఇందిరాగాంధి, కాంగ్రెసువారు ప్రయత్నించారు. హరిజనుల ఉద్ధరణకే కంకణం కట్టుకున్నట్లు నటించిన ఇందిరాగాంధి, 20 సూత్రాల పేరిట హరిజన ఓట్లకై గాలంవేసి నెగ్గింది. కాంగ్రెసు పార్టీలో వచ్చిన చీలికను తనకు అనుకూలంగా మలచుకోగలిగిన ఇందిరాగాంధి, ఆర్ధికంగా హరిజనులకు ఏవో పంచుతున్నట్లు చూపి, రాజకీయంగా వారిని నిర్వీర్యుల్ని చేసింది. అంటరానితనాన్ని పాటించే శంకరమఠాలను ఆమె ప్రోత్సహించడమే గాక, దక్షిణాదిలో శంకరాచార్యుల ఆశీస్సులకోసం తరచు వచ్చింది.