పుట:Abaddhala veta revised.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అంబేద్కర్ రచనలలో అముద్రితంగా వున్న రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా, అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళన జరిగింది. బి.జె.పి.,శివసేన, హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్ లో బి.జె.పి. వారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి. ఫలానా విషయం తృణీకరిస్తున్నామంటే, ఎందుకో కారణాలు కూడా బి.జె.పి. చెప్పాలి. ఇదేమీ చేయకుండానే బి.జె.పి. హఠాత్తుగా అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు జరుపుతూ వూరేగింపులు చేస్తుంటే అంబేద్కర్ వణికిపోతుండాలి! బుద్ధుడికి హిందువులు పట్టించిన గతి, అంబేద్కర్ కు బి.జె.పి. వారు పట్టించదలచారా?

అంబేద్కర్ హిందూమతాన్ని ఖండించారు. వేదాలనుండే మొదలైన వర్ణవ్యవస్థ, పురుషసూక్తంనుండీ 4 వర్ణాల వర్ణన పేర్కొని, నిరసించారు. ధర్మశాస్త్రాల అమానుష నియమాలను, రామాయణ,మహాభారత అవినీతి పంధాను బట్టబయలు చేశారు. హెచ్చుతగ్గుల హిందూసమాజంలో శూద్రుల స్థితి,బౌద్ధంపై పోరాడి సృష్టించిన అంటరానితనం హిందువులు ఎలా పోషించారో చారిత్రకంగా పేర్కొన్నారు. హిందువులు పూర్వం యజ్ఞయాగాదుల పేరిట ఆవుల్ని చంపి, ఆవు మాంసం తిన్న ఉదంతాల్ని చూపారు. హిందూమతంలో అంటరానివారికి స్థానం లేదనీ, సమానత్వం రాదనీ స్పష్టం చేశారు. కనుక హిందూమతాన్ని తృణీకరించి, బౌద్ధులుగా మారి అంటరానివారంతా సమానతను సాధించుకోవాలన్నారు.

అంబేద్కర్ కేవలం ద్వేషంతో, పగతో హిందువులలో అగ్రవర్గాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.

మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను అంబేద్కర్ చూపారు. ఇవేవీ తెలియనట్లు బి.జె.పి. నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా? అంబేద్కర్ ఆశయాలు అమలు జరగాలంటే, కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. వాటిని పాటించరాదని,మానవ హక్కులకు అవి విరుద్ధమని గ్రహించాలి. పాఠ్యగ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి. అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధిపతుల్ని ఖండించాలి. ఇవి చేయడానికి బి.జె.పి. సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి. కేవలం అంబేద్కర్ ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి. ఎన్నికల నినాదంలో (ప్రణాళికలో) రాంమందిర్ ప్రస్తావన బి.జె.పి. విరమించాలి. రాముడిని గురించి అంబేద్కర్ ఏమంటున్నాడో చూద్దాం: