పుట:Abaddhala veta revised.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరోవైపు సామ్యవాద ఉద్యమాల హోరువలన ప్రచార సాహిత్యం పుంఖాను పుంఖంగా ప్రారంభమైంది. శ్రీ శ్రీ యిందుకు శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్టులు అప్పుడప్పుడూ మతాన్ని ముట్టడించినా, మతవిమర్శలోనే అన్ని విమర్శలూ ఆరంభించాలనే మార్క్స్ సూత్రాన్ని పాటించలేదు. ఆర్థిక చట్రం మారితే అన్నీ వాటంతట అవే కుదుటబడతాయని, మతం ఉపరితల నిర్మాణం అని భావించారు. అదంతా దోషపూరిత ఆలోచన అని రుజువైంది. కమ్యూనిస్టుల ప్రచార సాహిత్యం కొందరు యువకులను తాత్కాలికంగా ఉద్రేకపరచినా అది నిలవలేదు. అయితే స్వాములు, బాబాలు చేస్తున్న మోసాల్ని బయట పెట్టడంలో కమ్యూనిస్టు కవిత తోడ్పడింది.

గోపీచంద్ వంటివారు హేతువాద ధోరణిలో రచనలు ఆరంభించి క్రమేణా అరవిందో ప్రచారకులుగా మారిపోయారు.

హేతువాదం మతపరిధిలో మార్పులు తేవడం కుదరనిపని అని గ్రహించింది. మతాన్ని, దైవభావాన్ని శాస్త్రీయంగా పరిశీలించింది. మానవుడే కొలమానం, మనిషి అన్నిటికీ మూలం అనే మూలసూత్రాలతో హేతువాదం ఆవిర్భవించింది.

అంతర్జాతీయంగా వచ్చిన మానవ హక్కులు హేతువాదానికి పట్టుగొమ్మలు. మత సమాజంలో మానవహక్కులకై కృషిచేయడమంటే ఎదురీతే. అందుకే హేతువాదంలో రచనలు చేసేవారు మైనారిటీగానే మిగిలారు. వీరిది దీర్ఘకాలిక కృషి.

ఆంధ్రలో ఎం.ఎన్.రాయ్, మానవవాదతత్వంతో ప్రభావితులైన పాలగుమ్మి పద్మరాజు, జి.వి. కృష్ణారావు తమ రచనల ద్వారా కృషి చేశారు. వారి ప్రభావం పరిమితమే అయినా, రాజకీయ పార్టీల మోసాలు బయటపెట్టడంలోనూ, మానవుడి కీలకపాత్రను చాటడంలోనూ వీరి సాహితీ సేవలు తోడ్పడ్డాయి.

సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాలకృష్ణమూర్తి తమ రచనలతో చెప్పారు. కొందరు కవులు, రచయితల్ని ఉత్తేజపరచారు. కొండవీటి వెంకటకవినుండి కొల్లా కృష్ణారావు వరకు ఆయన ప్రేరణలో రచనలు చేసి హేతువాదం మానవుడికి ఎలా అవసరమో చూపారు. మతంలోని అమానుష విలువల్ని ఎదిరించిన, ఆవుల గోపాలకృష్ణమూర్తి మనిషి కీలక స్థానాన్ని చాటడంలో తన పదునైన రచనల్ని ప్రయోగించారు.

హేతువాదానికి శాస్త్రీయ దృక్పధం పునాది. ఆంధ్ర సాహిత్యంలో శాస్త్రీయ పద్ధతి గురించి, శాస్త్రాన్ని గురించి రచనలు బహుకొద్ది మందే చేశారు. శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి విజ్ఞాన వీధులు. మహీధర రామమోహనరావు రచనలు, కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాలు, రావిపూడి వెంకటాద్రి విశ్వాన్వేషణ, జీవం అంటే ఏమిటి? శాస్త్రీయ రంగంలో హేతువాద దృక్పధం ప్రబలడానికి తోడ్పడుతున్నాయి. శాస్త్రాన్ని కూడా మతనమ్మకాలకు, మూఢవిశ్వాసాలకు అనుకూలంగా వాడే ప్రయత్నం కొందరు చేయకపోలేదు. అయితే అవి నిలవలేదు. శాస్త్రబలం అలాంటిది.