పుట:Abaddhala veta revised.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రను హేతువాద దృక్కోణంలో చూడడం మన అవగాహనకు అవసరం. చాలాకాలం కట్టుకథలతో, పుక్కిటి పురాణాలను చరిత్రగా చలామణి చేశారు. అందుకు భిన్నంగా కల్లూరి బసవేశ్వరరావు, భట్టిప్రోలు హనుమంతరావు వంటివారు చరిత్రను శాస్త్రీయంగా అందించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. మన వెనుకబడినతనానికి చరిత్ర అవగాహన లోపించడం ప్రధానకారణం. ఏది వూహ, ఏది వాస్తవం అనే విచక్షణ లోపించింది. అందుకే చరిత్ర పరిశీలనకు శాస్త్రీయ దృక్పధం కొలమానంగా వుండాలి.

సెక్స్ గురించి మన సమాజంలో వున్నన్ని అపోహలు, అశాస్త్రీయ ఆలోచనలు మరే రంగంలోనూ లేవేమో! చలం కొంతవరకు యీ విషయంలో కొత్త మార్గాన్ని అవలంబించారు. ధనికొండ హనుమంతరావు,రాంషాలు మరికొంత ముందుకువెళ్ళి శాస్త్రీయ దృక్పధాన్ని ప్రబలింపజేశారు. వైద్యశాస్త్ర జ్ఞానంతో ముడిపడివున్న యీ సెక్స్ జ్ఞానం విద్యార్థి దశ నుండి అందరికీ అవసరమని ప్రపంచవ్యాప్తంగా గ్రహించారు. డా॥సమరం నాస్తిక కేంద్రం నుండి సెక్స్ జ్ఞానాన్ని, హేతుబద్ధంగా దినపత్రికల ద్వారా, పుస్తకాల రూపేణా విపరీత ప్రచారంలోకి తెచ్చారు. కామిగానివాడు మోక్షకామికాడనే మాట విన్నాం. ధర్మార్ధ కామమోక్షాలలో కామాన్ని ఒక పురుషార్ధంగా చేర్చారు. దేవాలయాలపై రతి రహస్యాలను చెక్కారు. అయినా సెక్స్ గురించి మూఢనమ్మకాలే మన సాహిత్యంలో ఎక్కడ చూచినా ఎదురయ్యాయి. హేతువాద దృక్పధం సెక్స్ జ్ఞానంలో అవసరమని ఇప్పుడిప్పుడే కొద్దిమంది గ్రహించారు. ముఖ్యంగా రచనలు చేసేవారు తెలుసుకోకుండా వాత్సాయన కామశాస్త్రం దగ్గర ఆగిపోతే ప్రమాదం. స్త్రీలపట్ల వివక్ష చూపడంలో సెక్స్ జ్ఞానలోపం ఒకటి అనేది కూడా గ్రహిస్తున్నారు.

మన సాహిత్యరంగంలో హేతువాద దృక్పధం బాగా లోపించడానికి సైకాలజి బొత్తిగా తెలుసుకోకుండా రచనలు చేయడం కారణం. సి. నరసింహారావు "రేపు" అనే పత్రిక ద్వారా సైకాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక సమస్యల్ని హేతువాద దృక్పధంతో పరిష్కరింపజేయడానికి కృషిచేశారు. ఆధునాతనంగా మానసికరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రజల్లోకి రావాలి. స్త్రీపురుషులు, పిల్లలు గురించి శాస్త్రీయ అవగహన వుంటేనే సమాజాన్ని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇది నిత్యనూతనంగా జరగాల్సిన కృషి. బాల్యావస్థలోవున్న సైకాలజీ జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎంతో శ్రమ అవసరం.

సాహిత్యపరంగా మన సమాజంలో మహిళలకు జరిగిన అన్యాయం అమానుషమైనది. మతపరంగా వచ్చిన యీ వివక్ష అన్ని రంగాల్లోనూ ప్రబలింది. పాశ్చాత్య దేశాలలో వచ్చిన స్త్రీ విమోచనోద్యమం ఇంకా మన దగ్గర శైశవ దశలో వున్నది. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులు స్త్రీ శక్తి సంఘటనల పేరిట కొంత చైతన్యాన్ని తెచ్చారు. అయితే హేతువాద దృష్టిలో రచనలను చేసి మహిళా రంగంలో ఒక ఉప్పెనవలె చైతన్యం తేవడానికి మల్లాది సుబ్బమ్మ చేస్తున్న కృషి అనన్యసామాన్యం. మత ఛాందసులను అడుగడుగునా ఎదుర్కొంటూ ఆమె రచనలు సాగిస్తున్నారు.