పుట:Abaddhala veta revised.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్యాశుల్కం, వ్యభిచారం ఇత్యాది అవినీతికర సమస్యల్ని గురజాడ అప్పారావు ఇతివృత్తంగా స్వీకరించి ఉత్తరోత్తరా సంస్కరణవాదులకు కొన్ని మార్గాలు చూపారు.

స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, బిడ్డల శిక్షణలో శాస్త్రీయ దృక్పథం ఒక తీవ్ర ఉద్యమంగా చలం తన రచనల ద్వారా చూపారు. ఇవన్నీ మత పరిధిలో సంస్కరణలు ఉద్దేశించినవే.

కట్టమంచి రామలింగారెడ్డి ప్రబంధాలలో,భారతంలో స్త్రీలను చులకనగా చూచిన పద్ధతిని ఎత్తిచూపి, ద్రౌపదివంటి పాత్రలను శ్లాఘించారు. మతాన్ని మానవుడు సృష్టించాడు. ఎంతో సాహిత్యం మతపరంగా వచ్చింది. ఆ మతం, సాహిత్యం మానవుడికి ప్రాధాన్యత పోగొట్టి, అతడిని దేవుడికి బానిసగా, మూఢనమ్మకాల కీలుబొమ్మగా చేసి ఆడించాయి. ఇవి భరించలేక, మత సంస్కరణలు, వాటి ప్రభావంతో పైన సూచించిన తీరులో రచనలు వెలువడ్డాయి. కాని సనాతనులు సంస్కరణల్ని వ్యతిరేకించారు.

విశ్వనాధ సత్యనారాయణ వంటి వారెందరో కులతత్వంతో సహా సనాతన మతాన్ని, విలువల్ని అట్టిపెట్టాలన్నారు. సంస్కరణవాదుల్ని నిరసించే సాహిత్యం వచ్చింది. దివ్యజ్ఞాన సమాజం ఇందుకు అండదండలు చేకూర్చి పెట్టింది.

జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక సాంఘిక ఉద్యమంగా ఆంధ్రలో త్రిపురనేని రామస్వామి వంటివారిని ప్రోత్సహించింది. పురాణాలను, రామాయణ, భారత, భగవద్గీతలలోని అమానుష విలువల్ని చూపుతూ ఆయన రచనలు చేశారు. ఆర్యసమాజ్,హిందూ మహాసభ ప్రభావంతో ఆయన ఉద్యమం సాహిత్యపరంగా సాగగా కొందరిని ప్రభావితం చేసింది.

మతం పేరిట సాగుతున్న అంటరానితనాన్ని ఖండిస్తూ జాషువా కవితలు ఎందరినో కదలించి వేశాయి. దేవుడి పేరిట మతం దృష్ట్యా సాగిపోతున్న బూతును తాపీ ధర్మారావు కొంతవరకు శాస్త్రీయంగా బయటపెట్టారు.

మతాన్ని, దేవుణ్ణి అంగీకరిస్తూనే సంస్కరణలు రావాలని ఇలాంటి సాహిత్యం ఎంత వచ్చినా, మూలాన్ని పెకలించలేకపోయింది. మతానికి కట్టుబానిసలుగా మారిన మనుషులను బంధవిముక్తులను గావించడానికి తీవ్రస్థాయిలో గోరా నాస్తిక ఉద్యమం మొదలెట్టారు. వెలికి గురయ్యారు.

మరోప్రక్క దేశ స్వాతంత్రోద్యమ ప్రవాహంలో ప్రభావితులైన వారు ఆ ధోరణిలో ఎన్నో రచనలు చేశారు. నాయకులపై కవితలు, వచనాలతో కూడిన సాహిత్యం వెలువడింది. ఉన్నవ లక్ష్మినారాయణ 'మాలపల్లి', తుమ్మల సీతారామమూర్తి 'ఆత్మకథ' ఇందులో భాగమే.

సంఘంలో జరుగుతున్న అక్రమాలు,మతం పేరిట సాగుతున్న దురన్యాయాలు 'సాక్షి' ద్వారా పానుగంటి లక్ష్మీనరసింహారావు వెల్లడించి నవ్వించారు.