పుట:Abaddhala veta revised.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు కులాల్లో అనేక పిల్ల వూడలు బయలుదేరి బలపడ్డాయి. ఈ నాలుగు కులాలకూ దూరంగా అంటరానివారనే కులాన్ని అమానుషంగా సృష్టించిన తీరు అంబేద్కర్ వివరంగా చర్చించారు.

ఏ కులంవారు ఏమి చేయాలి? అనే వివరాలు ధర్మశాస్త్రాలు చర్చించి, హద్దు దాటితే ఎలాంటి శిక్షలు వేయాలో చెప్పాయి. కులంలోని హెచ్చుతగ్గులే శిక్షలలోనూ పాటించారు. కులవృత్తిని వీడకు గువ్వలచెన్నా అంటూ ప్రబోధించారు. కులాలలో చీలికలు వచ్చాయి. కొట్లాటలు సంభవించాయి. లెక్కించడానికి వీలుగానన్ని ఉపకులాలు బయలుదేరాయి. కాని మూలం దెబ్బ తినలేదు. కులాన్ని సమర్థించే మతం వున్నంతకాలం యీ బలం అలానే వుంటుందని రుజువైంది. వేదాలు పవిత్ర ప్రమాణ గ్రంథాలని, గీత చేతిలో పట్టుకొని ప్రార్థనలు చేస్తున్నంత కాలం కులం ఉంటుంది.

కులం అంటే ఏమిటి అని శాస్త్రీయంగా పరిశీలిస్తే నిలువదు. బ్రాహ్మణులలో, కమ్మ, రెడ్డి, కాపు, మాల మాదిగలలో రక్త పరిశీలన చెస్తే అన్ని కులాల్లో అన్ని రకాలైన రక్తం వున్నది. ఒకరి రక్తం మరొకరికి యిచ్చి ప్రమాదాలలో, ఆపరేషన్ల సందర్భాల్లో ఉపయోగిస్తే-కుల రక్తం లేదని, ఏ కుల రక్తమైనా మరొక కులానికి డాక్టర్లు వాడవచ్చనీ రుజువైంది. రంగును బట్టి కులం నిర్ధారించే వీల్లేదు. అన్ని రంగులవారు అన్ని కులాల్లోనూ వున్నారు. గుణాన్ని బట్టి, వంశపారంపర్యతను బట్టి అనడానికి ఆధారాలు లేవు. అన్ని లక్షణాలు, తెలివితేటలు, మూర్ఖత్వాలు అన్ని కులాల్లోనూ వున్నాయి. కనుక కులం ఏ పరిశీలనకూ నిలువదు.

కులం ప్రమాదాన్ని గుర్తించిన మత, సాంఘిక, రాజకీయ సంస్కర్తలు వున్నారు. కులం పోవాలని వారు ప్రచారం చేశారు, రాశారు, కులాంతర వివాహాలు ప్రోత్సహించారు. అంతవరకు బాగానే వున్నది. కులానికి మూలం మతం అనే విషయం వారికి తెలియకపోలేదు. అయినా మతం సంస్కరిస్తే చాలనుకుంటే వీలుకాలేదు. వేదాల్ని, ఇతిహాసాల్ని, గీతను, శంకరాచార్య రచనల్ని వీరు సంస్కరిస్తే మత మౌలికవాదులు ఒప్పుకుంటారా? మూలవేరును తొలగించకపోతే, అది పిలకలు పెడుతూనే పోయింది. మతం బ్రతికి వున్నన్నినాళ్ళు కులం చావదని సంస్కర్తలు గ్రహించలేదు. కనుక కులాన్ని ఎంత వ్యతిరేకించినా అది నిష్ప్రయోజనమే అయింది. కులం పోవాలన్న గాంధీజీ వర్ణవ్యవస్థ నేనే సృష్టించానన్న భగవద్గీతను బోధించారు. కులం పోవాలన్న ఆర్యసమాజ్ వర్ణవ్యవస్థ గల వేదాల్లోకి పోదామన్నది. వివేకానంద ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా కులాన్ని పాటించిన అద్వైతే. ఈ విధంగా సంస్కర్తలు మూలం జోలికి పోకుండా ప్రాకులాడి విఫలమయ్యారు. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న తరువాత కూడా, వారి సంతానానికి చట్టరీత్యా తండ్రి కులాన్ని పాటిస్తారు. ఇది మతరీత్యా వచ్చిందే. కులాంతర పెళ్ళి చెసుకున్న తరువాత చేసుకున్నవారికీ, వారి సంతానానికీ కులం వుండరాదు. అలా చట్టాల్ని మార్చుకోవాలి. పాలకులు మార్చలేదు. ఇది మత ప్రభావమే.