పుట:Abaddhala veta revised.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూంగ్,ఐసెంక్,న్యూతన్,కెస్లర్ వంటి శాస్త్రజ్ఞులు జ్యోతిష్యంలో ఆసక్తి చూపి ప్రయోగాలు చేసి, శాస్త్రీయమని రుజువు చెఉఅలేకపోయారు.

అనేక మంది నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రజ్ఞులు జ్యోతిష్యాన్ని ఖండిస్తూ ప్రకటించి, ఇది అశాస్త్రీయమని చెప్పారు.

- హేతువాది, నవంబరు 1991
రాజకీయాల్లో కులం: హేతువాదు లేమంటారు?

ఎక్కడ చూచినా కులం, తప్పించుకోడానికి వీల్లేని తీరులో కులం, పుట్తినదగ్గర నుండీ చనిపోయేవరకూ కులం. దీన్ని గురించి హేతువాదులు మాట్లాడరా? అని ప్రశ్న ఉదయిస్తున్నది.

సమాజం ఎదుర్కొంటున్న ఏ సమస్యనుండీ హేతువాదులు పారిపోరు. నిశితంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తారు. పరిష్కారాలు సూచిస్తారు. అవి చేదుగా వుండొచ్చు, ఎదురీత కావచ్చు. అబద్దాల వేట హేతువాదులకు అలవాటే. కులం విషయంలోనూ అంతే.

కులసమస్య కొన్ని వేల సంవత్సరాలుగా వుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి? అని అడగొచ్చు. బ్రిటిష్ వారి పాలన నుండీ కులానికి కొత్త అంటురోగం వచ్చింది. రాజకీయాల్లో, పరిపాలనలో కులం ప్రవేశించింది. ప్రజలందరికీ కావలసిన రంగంలో కీలకవ్యక్తులు వుంటూ కులాన్ని పాటిస్తే ప్రమాదకర పరిణామాలు వస్తునాయి. కనుక రాజకీయాల్లో కులం గురించి విప్పి చెప్పవలసి వస్తున్నది.

కులం మనదేశానికి ప్రత్యేక లక్షణం. హిందూమతానికి పుట్టిన విషపుత్రిక కులం. దీని కవల పిల్లే అంటరానితనం. మానవ హక్కులకు, మానవ సమానత్వానికీ,గౌరవానికీ, ఏ మాత్రం విలువ యివ్వకుండా పుట్టిన కులాన్ని మతపరంగా కట్టుదిట్టం చేసినందున అది వ్యాపించి, ఘోర పరిణామాలకు దారితీసింది.

వేదాలలోని "పురుషసూక్తం" లోనే వర్ణ విభజన ప్రస్తావించారు. ఆ తరువాత వర్ణవ్యవస్థ "గీత" లో స్పష్టంగా చెప్పి, నేనే నాలుగు వర్ణాల్ని సృష్టించానని కృష్ణుడు చెప్పాడు. ధర్మశాస్త్రాలన్నీ వర్ణవ్యవస్థను ఎలా పాటించాలో వివరంగా పేర్కొన్నాయి. హిందువులు పవిత్ర గ్రంథాలుగా పేర్కొన్న గ్రంథాలలో యిలా వచ్చిన వర్ణ వ్యవస్థను ఆర్యసమాజ్ వారు సమర్థిస్తూ,వేదాలలో పేర్కొన్న వర్ణ వ్యవస్థ కులం కాదని భాష్యం చెప్పారు. అంబేద్కర్ సుదీర్ఘంగా చూచి వర్ణవ్యవస్తే కులం అని నిగ్గు తేల్చారు.

"వివేకచూడామణి" లో ఆదిశంకరాచార్యులు కుల ప్రస్తావన తెచ్చి,అన్ని జన్మలలో మానవజన్మ ఉత్తమమైతే బ్రాహ్మణజన్మ మరీ ఉత్తమమనీ అందులోనూ వైదికుల స్థాయి అత్యున్నతమనీ అన్నారు.