పుట:Abaddhala veta revised.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్వేషణా కేంద్రం ప్రపంచ సంస్థ అనడానికి కారణం వుంది. అనేక దేశాలలో ఈ సంస్థకు శాఖలు, ప్రతినిధులు వున్నారు. మనదేశంలో ఢిల్లీ, బొంబాయి, మద్రాసులలో ఈ కేంద్ర ప్రతినిధులు వున్నారు. చైనా, రష్యా, జపాన్, ఇటలీ, ఈజిప్టు, హంగరీ, జర్మనీ, స్పెయిన్, దక్షిణాఫ్రికా, తైవాన్, ఫిన్లాండ్, కెనడా, బెల్జియం, జకొస్లావేకియా, మెక్సికో, నెదర్ లాండ్స్ తో సహా మరికొన్ని దేశాలలో ప్రతినిధులు వున్నారు. ఆయా రంగాలలో జరిగే విషయాలు కేంద్రానికి తెలియపరచడం, ఎక్కడికక్కడ అద్భుతాలను,అతీంద్రియ విషయాలను, అపురూప చికిత్సలను పరిశీలించి, ఏ మేరకు శాస్త్రీయమో చూడడం వీరి ప్రధాన లక్ష్యం. ఇదొక బృహత్తర పథకం. ఎవరైనా ఆయా రంగాలలో సమాచారాన్ని అందిస్తే స్వీకరిస్తారు.

రెండు పత్రికలు

అన్వేషణా కేంద్రం ఎప్పటికప్పుడు అధ్యయన శిబిరాలు, గోష్టులు. చర్చలు నిర్వహిస్తుంటుంది. ఈ కేంద్రం రెండు పత్రికలు ప్రచురిస్తున్నది. ఒకటి ఫ్రీ ఇంక్వైరీ. ఇందులో భావాల బలం తేల్చడం ప్రధానం. ఏ విషయమూ చర్చకు అనర్హం కాదు. ఏ భావమూ పవిత్రమైనది కాదు. ఏదీ అంటరానిది కాదు. అన్నిటినీ రాపాడించి, శాస్త్రీయ పరిశీలనకు, మానవ హక్కులకు సరిపడుతుందా అనే దృష్టికి కొలమానంగా గ్రహిస్తారు.

మరో పత్రిక స్కెప్టికల్ ఇంక్వైరర్.ఇందులో అన్నిటినీ సందేహించి, ప్రశ్నించి, ఆధారాలకు నిలబడితేనే సరైనదని చెబుతారు. వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంటే ఎంతవరకు నిజం. అసలు కథ ఏమిటి? అని చూస్తారు. మేరీమాత కంట తడిపెడుతుంటే విగ్రహం పరిశీలించి, లోన ఏర్పాట్లు చూస్తారు. ఉన్నది ఉన్నట్లు జనానికి చెబుతారు. స్వస్థత కూటములలో ప్రార్థనతో అద్భుతంగా రోగాలు నయమవుతున్నాయని అంటే ఆ విషయాలను గ్రహించి పరిశీలిస్తారు. లోగడ జేమ్స్ రాంఢీ యిలాంటివాటి వెనుక వున్న ఆసలు విషయాలను బయటపెట్టాడు. ఆయన కూడా యీ సంస్థకు చెందినవాడే. చూపుతోనే చెంచాలు వంచడం, భవిష్యత్తు చెప్పడం మొదలైనవన్నీ వీరి పరిశీలనలోకి వస్తాయి. అందుకే యీ కేంద్రం విశిష్టమైనది. దీనిని సందర్శించడం యాత్రలో భాగంగా పెట్టుకోవాలి.

పాల్ కడ్జ్ యీ అన్వేషణా కేంద్ర స్థాపకులలో మూలపురుషుడు. న్యూయార్క్, స్టేట్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా రిటైరై ఆయన యీ కృషి చేబట్టాడు. తన ధనాన్ని కేంద్రస్థాపనకు ఇచ్చి మిగిలినది వసూలుచేసి పెద్ద భవనం నిర్మించారు. ప్రపంచమంతటా పర్యటించారు.

పాల్ కడ్జ్ మనదేశంలో కూడా పర్యటించారు. ఇటీవల చైనా కూడా వెళ్ళారు. అరబ్బు దేశాలలో శాస్త్రీయ పరిశీలనా సంఘాలు పెట్టడానికి తిప్పలు పడుతున్నారు.