పుట:Abaddhala veta revised.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
పత్రికలు,టి.వి.పై కన్ను

పత్రికలు, సమాచార కేంద్రాలు ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. రేడియో, టి.వి., పత్రికలు ఈ కోవకు చెందుతాయి. వీటిని నిత్యమూ ఒక కంట కనిపెడుతూ, అవి చెప్పేవాటిలో అబద్ధాలు వుంటే బయటకు చెప్పడం యీ సంఘం ప్రధాన ఉద్దేశం. అంతేగాక అసత్యాలు,అబద్ధాలు ప్రచారం చేయడానికి వెనుక గాధ ఏమిటో తెలుసుకుంటారు. సినీతారలు, మతప్రచారకులు, రాజకీయ నాయకులు వలన కొన్ని మూఢనమ్మకాలు ఎలా వ్యాపించాయో గ్రహిస్తున్నారు. ఇది కూడా నిరంతర కృషిగా సాగే కార్యక్రమం. ఈ సంఘానికి ఎటిన్ సి. రైయస్ అధ్యక్షులుగా వున్నారు.

ఆరోగ్యం-అతీంద్రియ శక్తులు

ఆరోగ్యం పేరిట అనేక చికిత్సా విధానాలు జనాన్ని ఆకర్షించి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఆధునిక శాస్త్రీయ వైద్యానికి మార్గాంతరంగా వీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా వీరి చికిత్సలో పసవుందా? ఎంతవరకు అది నిలుస్తుంది? ఏ మేరకు శాస్త్రీయం అని చూడడానికి మరొక సంఘాన్ని నియమించారు. విలియం జార్విస్ అధ్యక్షతన ఈ సంఘం పనిచేస్తున్నది.

అతీంద్రియ శక్తుల విషయమై కొన్ని యూనివర్శిటీలలో సైతం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జనం ఈ మోజులో పడిపోతున్నారు. కనుక యీ రంగాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి దేహైమన్ అధ్యక్షతన సంఘం ఏర్పరచారు. వీరు పేరాసైకాలజీ విషయాలన్నీ చూస్తారు.

ఇతర లోకాల నుండి ఎగిరే పళ్ళాలపై వింత మనుషులు రావడం, కొందరిని తీసుకెళ్ళడం, తిరిగి పంపడం, ఇలాంటి విషయాలు అర్థశతాబ్ధంగా వ్యాప్తిలో వున్నాయి. దీనిపై విపరీత రచనలు వచ్చాయి. దీని నిజానిజాలు తేల్చుకోవడానికి ఫిలిప్ జే.క్లాజ్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పరచారు.

మతాల అధ్యయనం

ప్రపంచంలో ఎన్నో మతాలు వున్నాయి. వాటిని గుడ్డిగా అనుసరించేవారు, మతాలు మార్చుకునేవారు. ఒక మతం కంటె మరొకటి మిన్న అనేవారు, కొత్తమతాల్ని స్థాపించేవారూ ఉన్నారు. మతాల్ని గుడ్డిగా వ్యతిరేకించేవారూ వున్నారు. అలాగాక మతాలన్నిటినీ శాస్త్రీయంగా పరిశీలించడానికి హెక్టర్ అవలోస్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పరచారు. మతం పేరిట జరిగే వాటిని వీరు పరిశీలిస్తారు. మత గ్రంథాలను చూస్తారు. హిందూ, క్రైస్తవ, యూదు, ఇస్లాం,బౌద్ధం వంటి వాటి మూలగ్రంథాలను, ఆచారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తారు. ఇస్లాంను అధ్యయనం చేయడానికి ఇబ్నవారక్ ను ప్రత్యేకంగా యీ సంఘంలో చేర్చుకున్నారు. ఇస్లాంపై శాస్త్రీయ పరిశీలన అంతగా జరగనందున, ఆ లోపాన్ని పూరిస్తారు.