పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డని ఒక వంక వార్తనువింటూ, మరొకవంక దాన్ని వ్రాస్తూ ఆండీ ఎదురు చెప్పాడు.

"ఇలా అయితే గందరగోళం జరుగుతుంది." అని ఆవృద్ధుడు గట్టిపట్టుపట్టాడు. "ఇందుకు నీవు అనుభవించవలసి వస్తుంది"

అయితే, అత డన్నదానికి బదులుగా ఆండీ చేసిన అద్భుతచర్య అతనికి వుద్యోగంలో ప్రమోషన్ తెచ్చిపెట్టింది. కార్యాలయ వ్యాపారం వేగంగా వృద్ధిపొందుతున్నది. మరొక ఆపరేటరు కావలసివచ్చాడు. ఆండీ ఆ వుద్యోగాన్ని సంపాదించుకున్నాడు. జీతం నెలకు ఇరవై అయిదు డాలర్లు.

తరువాత కొద్దికాలానికే మిష్టర్ బ్రూక్స్ ఆండీని బల్లదగ్గరికి పిలిచి అన్నాడు. "గ్రీన్స్‌బర్గు ఎక్కడుందో నీకు తెలుసా!"

"తెలుసు. ఇక్కడికి తూర్పున వుంది" - అన్నాడు గౌరవపూర్వకంగా.

"అక్కడి ఆపరేటరు మిష్టర్ టైలర్ రెండువారాలు సెలవు తీసుకోదలచాడు! అతనికి బదులుగా అక్కడ ఒక మనిషి కావాలి. నీవు ఆపని చేయగలవా !"

"చేయగలను" అన్నాడు ఏమాత్రం అనుమానించకుండా.

"మంచిది. నిన్ను అక్కడికి పరీక్షక్రింద పంపిస్తున్నాము.