పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమయంలో ఏర్పాటైన సంగీత సమ్మేళనాన్ని నడిపించటానికి పిలిపించాడు. అతడు ఏర్పాటుచేసిన సంగీత సమ్మేళనంలో ఆ రష్యన్ సంగీతజ్ఞుడు కూర్చిన తౌర్యత్రికాలు [ Symphonies ] కూడా ఉన్నాయి. ట్కైకోవిస్కీ బృందాన్ని కార్నెగీ తన యింటికి విందుకు పిలిచాడు. అందులో అతడు పూర్వం సంగీత సౌధ ప్రారంభోత్సవ సమయంలో విన్పించిన సంగీతాన్ని కార్నెగీ అనుకరించి విన్పించాడు. ఇలా అతిథేయి విన్పించిన సంగీతాన్ని గురించి తరువాత త్కైకోవిస్కీ "నేనే మహానందపడేటట్లుగా, అంత ఉదాత్తముగా అసలు నేనే సంగీతాన్ని వినిపిస్తున్నట్లుంది" అనివ్రాశాడు.

ఉక్కును, ఆయుధసామగ్రులను నిర్మించేవాళ్లు స్వలాభాలకోసం యుద్ధాలను తెచ్చి పెడుతుంటారు. ఇది సత్యమయినా కాకపోయినా ఆండ్రూ కార్నెగీ యుద్ధోత్సాహి కాడు. యుద్ధాలను కల్పించేవాళ్ళలో ఒకడు అతడు ఎన్నడూ కాలేడు. అతడు కాంగ్రెస్ లోతనతో బాటు సహప్రతినిధి అయిన మిస్సోరీ సెనెటర్ హెన్డర్ సన్‌ను కలుసుకొన్నాడు. అతడు అప్పుడే షోర్ హోమ్ హోటల్ లో ప్రవేశిస్తున్నాడు. వాళ్లు మాట్లాడుతుండగా వీథిలో ఒకవంకకు చూస్తూ "అడుగో అధ్యక్షుడు. నిన్ను పిలుస్తున్నాడు" అన్నాడు.

ఆ రోజుల్లో అమెరికా అధ్యక్షులు ఒకడైనా అంగరక్షకుడు ప్రక్కన లేకుండానే తమ ఇష్టంవచ్చినచోటికి, తమ ఇష్టంవచ్చిన సమయంలో వెళ్లుతుండేవాళ్ళు.