పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీధిని అడ్డంగా దాటి అధ్యక్షుడి దగ్గిరకు వెళ్ళి కార్నెగీ ఆతని కరచాలనం చేశాడు.

"ఓహో! కార్నెగీ ఎప్పుడు వచ్చావు?" అన్నాడు అధ్యక్షుడు.

"ఇప్పుడే హోటల్‌లోకి రిజిష్టరు చేయించుకోటానికి వెళ్లుతున్నాను"

"నీవు ఇక్కడికి ఏం పనిమీద వచ్చినట్లు?"

"మీతో మాట్లాడటానికి"

"అయితే రా!" అని అతడి చేయిని చేతిలోకి తీసుకొని "నడుస్తూ మాట్లాడుకుందాం. మాట్లాడు" అన్నాడు అధ్యక్షుడు.

సాయంత్రం చీకటి పడబొయ్యేటంతవరకూ వాళ్ళు వీధుల్లోగుండా నడుస్తూనే మాట్లాడుకున్నారు. ఇరువురిమధ్య చర్చ యెంతో ఉల్లాసకరంగా సాగింది.

"మిష్టర్ ప్రెసిడెంట్, అ శాంతి సమావేశం దరిదాపుగా విఫలమయినట్లే. అయినప్పటికీ శాంతివహించి క్షమించటం మనకు కర్తవ్యమనుకుంటాను. మీరు లాటిన్ అమెరికన్ ప్రతినిధులతో, వారి గౌరవార్థంగా ఆ చిన్ని సైనిక సమీక్షచేసి చూపించాయేగాని ఇంత సైన్యం మన కుందని చూపించటం కాదు. పయిగా మనకు సైన్యం లేదనీ, అవసరం లేదనీ చూపించటంకోసమే అని నిష్కర్షగా చెప్పారు. ఇది మీకు జ్ఞప్తి వుందనుకుంటాను. మనది గణతంత్ర రాజ్యకుటుంబంలో జ్యేష్ఠ సోదరుడివంటిది మాత్రమే. అని వారితో చెప్పారు.