పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చాడు. ఆనాటి ఆర్థిక భయోత్పాతంనుంచి ధ్వంసం కాకుండా బయటపడ్డ ప్రముఖ పారిశ్రామికుడు అతడు ఒక్కడే. ఈ సమయంలోనే చితికి డబ్బుకు అక్కర కలిగిన తన సంస్థలోని భాగస్థులు కొందరు తమ షేర్లను అమ్మజూపితే అతడు తన పేర వాటిని పుచ్చుకొన్నాడు కూడాను. ఇనుము ఉక్కు పరిశ్రమలు దరిదాపుగా స్తబ్ధస్థితిలో ఉన్న ఆ ఆర్థికమాంద్య సమయంలో కూడా బ్రాడ్డాల నిత్యం క్రమాభివృద్ధినిపొందుతూనే వున్నది. వస్తుసామగ్రి ఆర్థికమాంద్య సమయంలో చౌకగా వుంటుంది. తిరిగి మంచిరోజులు వచ్చినప్పుడు వ్యాపారాన్ని విజృంభించి ఆరంభించటానికి అతిశయమైన అవకాశం వుంటుంది. మంచిదినాలకోసం ఆగినవాళ్లు వస్తుసామగ్రికోసం అధికధనం వెచ్చించవలసి వుంటుంది. అందువల్ల యంత్రాదికం ఖరీదు పెరిగిపోతుంది. వచ్చేలాభాలు తక్కు వౌతవి. డబ్బు వుంటే సంస్థను వృద్ధిచేయటానికి ఆర్థికమాంద్య సమయమే తగిన కాలమన్న అంశాన్ని కార్నెగీ గమనించాడు. అందువల్లనే క్రమంగా ఆ మార్గాన్ని అనుసరించి వ్యవహరించాడు.

కార్నెగీ కుశాగ్ర బుద్ధివల్లనే 1875 లో పనిని తిరిగి విజృంభించి ప్రారంభించినప్పుడు ఎడ్గర్ థామ్సన్ కంపెనీ ఇతరమైన ఉత్పత్తిదారు లందరికంటే తక్కువధరలకు పట్టాలని విక్రయించ గలిగింది. అందువల్ల అనేకకర్మాగారాలు పనిలేక మందకొడిగా నడుస్తున్న దినాలల్లో ఈ కంపెనీ ఆర్డర్లను అసంఖ్యాకంగా పొందగలిగింది.

ఉక్కును ఉత్పత్తి చేయటంలో అమెరికాలోని అందరికంటే సమర్ధుడైన వ్యక్తి కెప్టన్ బిల్ జోన్స్ . ఇతడు వెల్ష్