పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనస్సులో కొంతకాలంనుంచి క్రమక్రమంగా ఘనీభవిస్తున్న ఒక తీర్మానాన్ని కాగితంమీద పెట్టటంకోసం నిర్నయం చేశాడు. మళ్ళా ముందుకు వ్రాలి ఒక విశిష్టమై విజ్ఞాపిక నిలా వ్రాసు కొన్నాడు.

సెయింట్ నికలాస్ హోటల్, న్యూయార్క్.
డిసెంబర్, 1868.


ముప్పది మూడేళ్ళ వయసు! రాబడి సంవత్సరానికి 50,000 డాలర్లు !! రెండేళ్ళకు, సరిగా ఈ సమయానికి, సంవత్సరానికి 50,000 డాలర్లకు తగ్గకుండా నా వ్యాపారాన్నంతటినీ చక్కదిద్దుకుంటాను. ఇంతకుమించి సంపాదన చెయ్యను. ప్రతి సంవత్సరం అదనంగా వచ్చినదాని నంతటిని ధర్మకార్యాలకు వినియోగిస్తాను. ఇతరులకోసం తప్ప వ్యాపారాన్ని పూర్తిగా పరిత్యజిస్తాను.

ఆక్స్‌పర్డ్‌లో నివాస మేర్పరచుకొని, ఉత్తమసాహిత్యకులలో పరిచయం కలిగించుకొని విద్యను పూర్ణంగా ఆర్జిస్తాను. ఇందుకు మూడు సంవత్సరాల తీవ్రకృషి అవసరం. ప్రజల యెదుట నిల్చి ఉపన్యాసాలిచ్చే విషయాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. తరువాత లండన్ నగరంలో నివాసమేర్పరచుకొని ఒక వార్తాపత్రికనో, సమీక్షా పత్రికనో పెట్టుబడి పెట్టికొని, ప్రజా వ్యవహారాలల్లో ముఖ్యంగా దరిద్ర జన విద్యాభివృద్ధులకు సంబంధించిన వాటిల్లో పాల్గొంటూ, దాని జనరల్ మేనేజిమెంటుమీద శ్రద్ధ వహిస్తాను.