నిశ్శంక కొమ్మన్న
ఈ కవి శివలీలావిలాసమును రచించెను. ఈ గ్రంథములోని మొదటి రెండాశ్వాసములు మాత్రమే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి యొద్ద నున్నవి. ఆందు మొదటి, రెండవ పత్రములు లేవు: మిగిలిన పత్రములు సహితము మిక్కిలి శిధిలములయి యున్నవి. ఈ కవిచే శివలీలా విలాసము వేమవీరభద్రారెడ్ల తమ్ముఁడును నల్లాడరెడ్డి పుత్రుఁడును నయిన దొడ్డారెడ్డి కంకితము చేయబడినది. పుస్తకావతారికయందల్లాడరెడ్డి పెదకోమటి వేమారెడ్డిని. గజపతిని జయించినట్టు చెప్పఁబడినది. కాటయవేముని యనంతరమున రాజమహేంద్రవరరెడ్డిరాజ్యము నాక్రమించుకోవలెనని యావల కొండవీటిరాజయిన పేదకోమటి వేమారెడ్డియు నీవల కటకాధీశ్వరుఁ డైన గజపతియుఁ బ్రయత్నించిరి. కాని వా రల్లాడ రెడ్డి యొక్క నిరంతర జాగరూకతవలనను పరాక్రమమువలనను విఫల ప్రయత్నులయి పరాజితులై వెనుక మరలవలసిన వారయిరి. వీరభద్రారెడ్డి రాజయిన తరువాత నాతని యగ్రజుఁడై న వేమారెడ్డియు ననుజుఁడయిన దొడ్డారెడ్డియు మహాబాహుపరాక్రమశాలు లయి శత్రురాజులతో యుద్ధములు చేసి సోదరుని రాజ్యమును పెంపుచెందించిరి. ఈ యిరువురి పరాక్రమములును కాశీఖండము నందిట్లు వర్ణింపఁబడెను
మ. కొనియం గంచుకముల్ సముద్భటనటద్ఘోటీభట ప్రౌఢిఁగై
కొనియె న్వేడుక జీడికోట యహీతక్షోణీశు లల్లాడఁ జే
కొనియె న్మాకవరంబు వీఁక మదవద్ఘోరారిసంహారియై
ఘనుఁ డల్లాడమహీశు వేమన నిరాఘాటైకధాటీగతిన్.