పుట:Aandhrakavula-charitramu.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

614

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వ్యాపారిశాఖవారు; బమ్మెరవారు శైవులు; నెల్లుట్లవారు వైష్ణవులు. పదునాఱవ శతాబ్దమునకుఁ గడపటిభాగముననో, పదునేడవశతాబ్దారంభముననో యుండిన నారాయణ కవిపూర్వులు మొదట రాజభండారమువారయి తరువాత నెల్లుట్లవారయిరఁట 1636 వ సంవత్సరప్రాంతమునం దుండిన యజ్జరపు పేరయ లింగము (ఒడయనంబివిలాసకర్త) బమ్మెర పోతరాజునకు నాలవతరమువాఁ డయిన కేసనకవి యొక్కకూఁతు రైన యెల్లమను వివాహమాడుటచేతఁ బోతన సంతతివారు పదునేడవ శతాబ్దారంభమునందుఁ గూడ నెల్లుట్లవారుగా మాఱక బమ్మెరవారుగానే యుండిరనియు, శైవులతో సంబంధములు చేసికోనుచుండిరనియు నొడయనంబివిలాసములోని యీ క్రింది పద్యము వలన స్పష్టముగాఁ గనఁబడుచున్నది –

      ఉ. బమ్మెరవంశమందునను బ్రౌఢసరస్వతిపద్దు గాంచి తా
          నెమ్మె దలిర్పఁ గేసనకవీశ్వరుఁ డప్పమనామసాధ్వియం
          దిమ్మఁహి గూర్మిఁ గన్న సుత యెల్లమయందును దేరయాఖ్యుఁడన్
          సమ్మతిఁ గంటి వీరనరసమ్మను గంగనమంత్రియుగ్మమున్.

బమ్మెరపోతనామాత్యుఁడు భాగవతరచనాప్రారంభకాలమునకే బమ్మెరను విడిచి యేకశిలానగరమును జేరెను. బమ్మెరవారికిని నెల్లుట్లవారికిని కౌండిన్యగోత్రసామ్య మొక్కటి దక్క వేఱు సంబంధ మేదియు లేదు. పదునాఱవ శతాబ్దాంతమునందు బమ్మెరప్రౌఢసరస్వతిపుత్రుఁడు కేసన్న రచియించిన హైమవతీవివాహావతారికవలన సహిత మీ యంశములు దేటతెల్ల మగును.