567
శ్రీనాథుఁడు
అనుత్రయోదశాంగసహిత మయి వీథి యుండవలె నని సాహిత్యదర్పణము విధించుచున్నది.
" వీధ్యాం కల్పిత మితివృత్తం ధీరోద్ధతో నాయకః ”
అని ప్రతాపరుద్రీయము వీధియందితివృత్తము కల్పితముగాను ధీరోద్దతుఁడు నాయకుఁడు గాను ఉండవలెనని విధించుచున్నది. నాయిక పరకీయగా నుండవలెననుట లోనుగాగల యితర లక్షణముల నితరలక్షణ గ్రంధములు బోధించుచున్నవి. ఈ పేర్కొనబడిన లక్షణములేవియు నీ యల్పకావ్యము నందు లేవు. ఇందు నాయకుఁడు లేఁడు; నాయిక లేదు. ప్రస్తావన లేదు, పాత్రములు లేవు. సంధులు లేవు, ఇతివృత్తము లేదు: వీధి కుండవలసిన యంగము లేవియు లేవు. ఈ పుస్తకము వలన శ్రీనాధమహాకవి దశ రూపక జ్ఞానము లేని యపండితుఁడని యాతని కపయశము కలుగుచున్నది. ఇందులో నున్న శృంగారమంతయు నశ్లీలమయి జారత్వవిషయమైన బూతు ప్రసంగము. శృంగారనాయకుఁ డిందు శ్రీనాధమహాకవియే.
గీ. చెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల
హాళిగాఁ జేత విడియంబుఁ గీలుకొలిపి
రంగపురరాజవీధిఁ గానంగ నయ్యె
నాదుమదిఁ గోర్కు లూర వైష్ణవవధూటి.
ఈ యసభ్య గ్రంధముయొక్క కర్తృత్వము నూరక యారోపించి మనవారు కొందఱు శ్రీనాధుని ముంపదలఁచుకొన్న దుర్యశఃపంకమునుండి యతఁడిది శ్రీనాధకవికృతము కాదని సిద్దాంత మయినప్పుడే లేచి బైలఁబడి గట్టెక్కి కృతార్ధుఁడు కాఁగలుగును [1]
మాకు దొరకిన శ్రీనాధవిరచితములయిన గ్రంధములనుండి కొన్ని పద్యముల నుదాహరించి యీ కవిచరిత్రము నింతటితో ముగించుచున్నాము.
- ↑ [శీనాథరచిత మైన 'వీథి నాటకము' కానరాదు కర్తృత్వము కల్పితము కావచ్చును. కాని యిందలి పద్యములు చాల వఱకును శ్రీనాథునివి చేరి యుండవచ్చునని కొందఱి యభిప్రాయము ]