పుట:Aandhrakavula-charitramu.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

541

శ్రీనాథుఁడు

ముగా శృంగారమును జొప్పించుట కవియొక్క శృంగారనాయక నిపుణత్వమును వెల్లడించుచున్నది. శ్రీనాధుఁడు స్త్రీలోలుఁడని లోకములో బలమైన వాడుకయు, తదనుగుణముల్లెన కథలును, పారంపర్యముగ వచ్చుచున్నవి. ఈ పద్యమే కాక గ్రంధములోని యితరపద్యములు సహిత మనేకము లాతని శృంగారనాయికా ప్రియత్వమును దెలుపుచున్నవి. భీమేశ్వరపురాణమును మొట్టమొదట బ్రకటించిన వారు తమ పీఠికలో 'పంచారామవధూటీ! పంచాస్త్ర విహార కేళిపాంచాలునకున్' అన్న షష్ఠ్యంతభాగము నుదాహరించి, ఇది యాకృతిపతికేనిఁ బంచారామవాసులగు పుణ్యాంగనలకేని గౌరవజనకంబుగ మాకుఁ దోఁచదు' అని వ్రాసి యున్నారు. ఇది గాక వుస్తకములో దీనిని మించిన పద్యము లున్నవి.

   శా. కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూషావళుల్
       లంచం బిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూఁ డన్ననిన్
       పంచాస్త్రోపముఁ దారతార కవయం బ్రార్థించి లోలోపలన్
       బంచారామములందుఁ [1] బల్లె లఁ బురిం బ్రౌఢేందుబింబాననల్

పంచారామములందు, పల్లెలలోను పట్టణములోను గల ప్రౌఢ స్త్రీలు తాము తామే బెండపూడి యన్నయను గవయుటకు కాంచీకంకణాదులైన భూషణములను తారుపుకత్తెలకు లంచము లిత్తురట! అత్యంత శివభక్తుఁడైన బెండపూడిఁ యన్నయ్య నిజముగానే జారుఁడయినను శాశ్వతముగా నుండదఁగి యాతఁడు కృతిపతిగాఁ గల గ్రంథములలో నిట్లుండుట సిగ్గుల చేటు కాదా ? ఈ విషయమున శివునకే గతీ లేనప్పుడు శివభక్తునిమాట చెప్పనేటికి ?

  మ. ఎనయంగల్గిన కూర్మి భృంగిరిటిగానీ దుండిఁ గానీ నికుం
      భునిఁ గానీ కయిదండ పట్టుకోని సంభోగేచ్చ నంతఃపురాం
      గనలం గన్ను మొఱంగి యప్పురములోనం గన్నె కాఁదారి ప్రొ
      ద్దున భీమేశుఁడు సానివాడ కరుగున్ ధూర్త ప్రకారంబునన్.

  1. [బల్వెల పురిన్ ... అనునది సరియైన పాఠము.]