Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

523

శ్రీనాథుఁడు

చెప్పినను, పరాజితుఁడయిన చంపరాజు స్వర్గాతిథి గాక బ్రతికియుండి మధురాసురత్రాణుని జయించుటలో కంపభూపతికి సహాయఁడు సహిత మయ్యెను. కంపరాజు సేనాధిపతియు, నిరుపమాన పరాక్రమశాలియునైన సాళువమంగరాజు సంపరాయనిరాజ్యములోఁ గొంతభాగ మతనికి మరల నిప్పించి యాతనిని మిత్రునిఁగాఁ జేసి సంపరాయస్థాపనాచార్యుఁడని పేరు పొందెను. జైమినిభారతములో పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు సాళువమంగును వర్ణించుచు నీ యంశము నీ క్రిందీపద్యములలోఁజెప్పియున్నాఁడు.

సీ. 'దురములో దక్షిణసురతాను నెదిరించి
                       కొనివచ్చి సంపరాయనికి నిచ్చి
     సామ్రాజ్యమున నిల్చి సంపరాయస్థాప
                       నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
     శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యర్వదివేలు
                       మాడ లద్దేవునుమ్మడికి నొసఁగె
     మధురాసురత్రాణు మడియించి పరపక్షి
                       సాళువబిరుదంబు జగతి నెరపె

     గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి
     తఱిమి నగరంపుగవకులు విఱుగఁ ద్రోలి
     తాను వ్రేసిన గౌరు నుద్దవిడిఁ దెచ్చె
     సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.'

ఈ ప్రకారముగా సంపరాయని సామంతరాజునుగా రాజ్యమునందు మరల నిలిపిన కాలము 1370-వ సంవత్సర ప్రాంతము. స్వరాజ్యమునందు పునస్సంస్థాపితుఁడయి సంపరాయఁడు 1400 సంవత్సర ప్రాంతమువఱకును రాజ్య భారమును వహించి యుండును. అనంతరమున సంపరాయని పుత్రుఁడయిన తెలుగుఁరాయఁడు రాజ్యమునకు వచ్చి 1435-వ సంవత్సరప్రాంతమువఱకును రాజ్యపాలనము చేసి యుండును. ఈ తెలుఁగురాయఁడు 1428 సంవత్సరమునందు సింహాచలయాత్ర చేసి యచ్చట నృసింహస్వామివారి దేవాలయములో నీ క్రింది శాసనము వ్రాయించెను.