26
ఆంధ్ర కవుల చరిత్రము
5. మంగియువరాజు- ఇతcడు రెండవ విష్ణువర్ధనుని పుత్రుఁడు. సర్వలోకాశ్రయుడనియు విజయసిద్ధి యునియు బిరుదనామములు గలవాఁడు. ఇతఁడు 672 వ సంవత్సరము మొదలుకొని 696 వ సంవత్సరము వఱకును, ఇరువదియైదు సంవత్సరములు రాజ్యపరిపాలనము చేసెను.
6. జయసింహుఁడు - ఇతఁడు మంగియువరాజునకు ప్రధమపుత్రుఁడు; మొదటి జయసింహుని పౌత్రుఁడు. ఈ రెండవ జయసింహుఁడు 696 మొదలుకొని 709 వఱకును పదుమూడు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను.
7. కొక్కిలిరాజు. ఇతఁడీ రెండవ జయసింహుని సవతితమ్ముడు మంగి యువరాజునకు ద్వితీయ కళత్రమువలనఁ బుట్టిన రెండవకొడుకు; ఇతఁడు 709 వ సంవత్సరములో *[1] తొమ్మిదినెలలు మాత్రము ప్రజాపాలనముచేసెను.
8. విష్ణువర్ధనుఁడు- ఇతఁడు కొక్కిలికి జ్యేష్ఠభ్రాత, సవతియన్నయగు జయసింహుని మరణానంతరమున రాజ్యము నక్రమముగా నాక్రమించు కొన్న కొక్కిలిరాజును సింహాసనవిహీనుని జేసి 709 మొదలుకొని 746 వఱకును ముప్పదియేడు సంవత్సరములు దేశమునేలెను. ఇతఁడు మూడవ విష్ణువర్ధనుఁడు.
9. విజయాదిత్యుఁడు - ఇతఁడు మూcడవ విష్ణువర్ధనుని కొడుకు. విక్రమరాముఁడనియు విజయసిద్ధి యనియు బిరుదములు గలవాఁడు. 746 మొదలుకొని 764 వఱకును పదునెనిమిదేండ్లు భూపరిపాలనము చేసెను. ఇతఁడు విజయాదిత్యనామముగల వారిలో మొదటివాఁడు
10. విష్ణువర్ధనుఁడు-ఇతఁడు విజయాదిత్యుని కుమారుడు. 764 మొదలు 799 వఱకు ముప్పదియాఱుసంవత్సరములని రాజ్యభారము వహించెను. ఇతఁడు నాల్గవ విష్ణువర్ధనుఁడు.
- ↑ [* 6 మాసములు మాత్రము రాజ్యము చేసి నట్లాంధ్రకవితరంగిణిలో గలదు. (పుట 84)]