పుట:Aandhrakavula-charitramu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

291

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

నించుమించుగా నేకకాలమునందే నన్నయభట్టు విడిచిన భారతభాగమును దెనిఁగింప నారంభించి యుందురు. ఇతఁడు రెండు మూఁడు పర్వములను మాత్రమే తెలిఁగింపఁగలిగెను; తిక్కన పదునేను పర్వములను జేసి గ్రంథము ముగింపఁగలిగెను. ఈతని కవిత్వము సంస్కృతసమాసపద భూయిష్ట మయి, సామాన్యులకు దురవగాహమయియుండెను; తిక్కన కవిత్వ మాంధ్రపదభూయిష్టమయి బహుజన సుఖావగాహమయి యుండెను. ఈ హేతువుచేతనే తిక్కన భారతము సర్వజనాదరణపాత్రమయు దేశమం దంతటను వ్యాపింపఁగా, నధర్వణభారతము కతిపయపండితజనై కాదరణపాత్ర మయి సర్వజనీన వ్యాప్తి గాంచక యాంధ్రదేశమున మృగ్య మయినది.అది యిప్పడు కతిపయ పూర్వలక్షణ గ్రంథములయందుదాహరింపఁబడిన పద్యరూపమున జీవించి యుండుటయే కాని సంపూర్ణపుస్తకరూపమున నెందును గానఁబడక నామమాత్రావశిష్టమయి యున్నది.

తిక్కనసోమయాజి భారతరచనము చేయ నారంభించునప్పటి కధర్వణాచార్యుఁడు త్రిలింగశబ్దానుశాసనమును జేసి యుండలేదు. ఆ కాలమునందు దశకుమారచరిత్రమును దిక్కన కంకితముచేసిన కేతనకవి తన యాంధ్ర భాషాభూషణవ్యాకరణమునందు

      క. "మున్ను తెలుఁగునకు లక్షణ
          మెన్నఁడు నెవ్వరును జెప్ప: రేఁ జెప్పెద వి
          ద్వన్నికరము మది మెచ్చఁగ
          నన్నయభట్టాదికవిజనంబులకరుణన్.

      గీ. సంస్కృత ప్రాకృతాదిలక్షణము చెప్పి
         తెలుఁగునకు లక్షణము మున్ను దెలుపకునికి
         కవిజనంబులనేరమి కాదు; నన్ను
         ధన్యుఁ గావింపఁ దలఁచిన తలపు గాని."

అని యా వఱ కెవ్వరును వ్యాకరణముచేసి యుండలేదని స్పష్టముగాఁ జెప్పెను. త్రిలింగశబ్దానుశాసనము మిక్కిలి పురాతనమయిన దనcగా