Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

253

పాలకురికి సోమనాథుఁడు

పురాణమునఁ జెప్పుటవలన, గురులింగార్యుఁ డీతని దీక్షాగురువనియు, అందు వలననే ఆతనిని జనకునిగా భావించెననియుఁ జెప్పవలసి యున్నది.

ఇతని కాలమునుగూర్చియు నభిప్రాయభేదము లున్నవి. బసవపురాణమును తొలుత పరిష్కరించి, విపుల విమర్శన వ్రాసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సోమనాధుఁడు క్రీ. శ. 1180 నాఁటికే సుప్రసిద్ధుఁ డగుటచే బసవ పురాణ మా ప్రాంతముననే రచియింపఁబడి యుండుననియు తెల్పియున్నారు. శ్రీ బండారు తమ్మయ్యగారు క్రీ శ. 1160-120 మధ్యకాలమున నీత డుండెనని నిశ్చయించిరి. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు క్రీ.శ. l190-1260,70 ల మధ్యకాలమున నీతcడుండెనని నిర్ణయించిరి. బసవపురాణ రచనాకాలము క్రీ శ 1178 అని శ్రీ దేవరపల్లి వేంకట కృష్ణారెడ్డిగారు తమ 'నన్నెచోడకవి చరిత్ర' లోఁ దెల్పి యున్నారు ఈ కాల మించుమించుగా ఓరుగంటిని పాలించిన కాకతిప్రోలరాజు పుత్రుఁడు మొదటి ప్రతాపరుద్రుని కాలమునకు సరిపోవును. సోమనాధుఁడు ఆ ప్రభువర్యుని సభలోనే ప్రతివాదులను వాదమున నోడించి వీరశైవ మతమును స్థాపించి యున్నాడని పలువురి యభిప్రాయము.

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు శాసన ప్రమాణములు నాధారముగాc గొని బసవపురాణ, పండితారాధ్య చరిత్రములు క్రీ.శ. 1290-1320 ల నడిమికాలమున రచింపఁబడినవనియు, సోమనాథుని కాలమదియే యనియు దెల్పియున్నారు. ఇయ్యది రుద్రమదేవి మనుమఁడగు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమునకు సరిపడును. శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారు, శ్రీ చిలుకూరి నారాయణరావుగారు, శ్రీ సోమశేఖరశర్మగారి వాదమునే సమర్ధించిరి. 'ఆంధ్రకవితరంగిణి' కారులను, శతక వాజ్మయ సర్వస్వము ను రచించిన శ్రీ వేదము-వేంకట కృష్ణశర్మగారును పయి వాదమునె యనుసరించిరి.