యట్టిపని సాధ్యము కానందున నొక్కొక్కచోట నెందేని పూర్వాపరవిరుద్దాంశములు సహిత మిందు పడి యున్నవి. అట్టి వేవేని కనబడినపక్షము మొదటc జెప్పఁబడినదానికంటెఁ దరువాతఁ జెప్పఁబడినది యధిక ప్రమాణ మని చదువరులు గ్రహింతురుగాక. ఈ ప్రకారముగా చిన్నవో పెద్దవో యతుకులు వేయుచు బెంగుళూరిలో గ్రంథమును శ్రీనాథునివఱకు నెట్లో యీడ్చుకొని వచ్చితిని గాని యక్కడకు వచ్చు నప్పటి కెంత పెద్దయతుకులు వేసినను కుదరక క్రొత్తయల్లిక విశేషముగా కావలసి వచ్చెను. ఆందుచేత శ్రీనాథుని చరిత్రములో ముప్పాతిక మువ్వీసము క్రొత్తగావ్రాయవలసినవాఁడ నైతిని. ఈ ప్రకారముగానే యీభాగము నందు మున్ను లేని వయి యిప్పుడు క్రొత్తగాఁ జేర్పఁబడిన నన్నె చోడుడు మొదలైనవారి చరిత్రము లన్నియు నూతనముగానే వ్రాయcబడినవి. ఇవి యన్నియు బెంగుళూరిలోనే వ్రాయcబడిన వగుటచేత నచ్చటఁ గర్ణాటకకవిచరిత్రాదులను జదివి వానివలన లాభము గొంతవఱకుఁ బొందుట తటస్థించెను. నన్నె చోడుని చరిత్రమునందును భీమకవి చరిత్రమునందు నథర్వణాచార్యుని చరిత్రమునందును నేనిచ్చట బొందిన యీ లాభము కొంతవఱకు తేటపడ వచ్చును. శ్రేయాంసి బహువిఘ్నాని యన్నట్లు బెంగళూరిలో సహితము నాపని నిర్విఘ్నముగా సాగినది కాదు అక్కడ నా వెంట వచ్చిన యొక చిన్నదానికి స్ఫోటకము వచ్చెను. ఈ యంటు రోగమునకు భయపడి మేమక్కడ కుదుర్చుకొన్న బాలసేవకుఁడును పనికత్తెయు గూడ నొక్కసారిగా మమ్మువిడిచి పోయిరి. వారిస్థానమున క్రొత్త సేవకులు దొరకరైరి, ఆందుచేత నసహాయుల మయి నేనును నావెంట నాసంరక్షణము నిమిత్తము వచ్చిన లోకానుభావము చాలని యువతీమణియు సదా రోగిని కనిపెట్టుకొనియుండి యుపచారములను జేయవలసిన వార మయితిమి. ఈశ్వరానుగ్రహమువలన రోగి స్వస్థ పడెను గాని మనోవ్యాకులత చేతను రాత్రులు నిద్రలేకపోవుటచేతను నేను జ్వరపడి యత్యంత దుర్బలుండ నయి రాజమహేంద్రవరమునకు వచ్చినతరువాత సహితము నెల దినములకంటె నెక్కువకాలము నేనేమియు పనిచేయ లేక పోతిని. అయిన నాయెడ నీశ్వరానుగ్రహము పూర్ణముగా నుండినందున నేను మరల స్వస్థపడి విఘ్నమృగముల బారికి తప్పి బైలపడి యీ ప్రధమభాగము నొకవిధముగా ముగింప శక్తుఁడ నయితిని. నాయెడలఁ జూపినయీయసాధారణానుగ్రహమునకై నేనీశ్వరునకు భక్తివూర్వకము లైనవందనసహస్రములను సమర్పించుచున్నాను. మిగిలిన రెండుభాగములను గూడ సంస్కరించి ప్రకటించు శక్తిని మానసోత్సాహమును భక్తాభీష్ట ప్రదాయకుఁడైన పరమేశ్వరుఁడు నాకు ప్రసాదించును గాక ! జరాభారము వలనను ప్రూఫులను తిన్నఁగా దిద్దలేకపోవుటవలన ననివార్యముగా పడినయచ్చుపొరపాటులను సరకుగొనక చదువరులు నన్ను మన్నింతురు గాక!
నేను బెంగళూరిని విడుచుటకు "రెండుమూcడుదినములు ముందు శ్రీనాథుని చరిత్ర సంబంధమున సర్వజ్ఞబిరుదాంచితుఁ డైన శ్రీరావు సింగభూపాలుని కాలనిర్ణయమును గూర్చి యాలోచించుచుండినప్పుడు నా కాకస్మికముగా తద్వంశజులును ప్రస్తుతపీఠికాపురాధీశ్వరులును సాధారణముగా సమస్తసత్కార్యాభివృద్ధుల కొఱకును విశేష