ముగా నాంధ్ర భాషాభివృద్దికొఱకును సమాజనిరంతరాదరౌదార్యములను జూపుచున్న వారును నైన మహారాజశ్రీశ్రీరాజారావు వేంకటకుమారమహిపతినూర్యారావు బహుదురుగారు నాకు స్మరణకు వచ్చి యీ కవుల చరిత్రమును వారి కంకితము చేయవలెనన్న బుద్ధి పుట్టినది. అది యీశ్వరాదేశ మని భావించి యీ కవిచరిత్రమును వారికిఁ గృతి యిచ్చుట కప్పుడే నిశ్చయము చేసికొంటిని. వారిసుగుణసంపదను గూర్చి యిందుచెప్పుట స్తోత్ర పాఠముగాc గనcబడ వచ్చును. గాన నిందింత కంటె నధికముగా వ్రాయను. లోకరక్షకుc డైనయీశ్వరుఁడు లోకోపకారార్ధముగా వారికి దీర్ఘాయురారోగ్యైశ్వర్యములను బ్రసాదించును గాక!
నేనీ కవులచరిత్రమును శీఘ్రకాలములోఁ బ్రచురింపవలె నని కోరఁగా ప్రతిదినమును
రెండేసిఫారముల చొప్పున నచ్చుగూర్చియిచ్చి పుస్తక మింత శీఘ్రముగా వెలువడుటకు హేతుభూతులైన శ్రీమనోరమా ముద్రాక్షరశాలాధికారులకు వందనములు జేయుచున్నాను.
రాజమహేంద్రవరము కందుకూరి వీరేశలింగము.
11వ ఆక్టోబరు 1917
రెండవకూర్పునకుఁ బీఠిక.
ఆధునికాంధ్రసారస్వత పితామహుఁడును శతాధిక గ్రంథకర్త యునాంధ్రవచన రచనాచక్రవర్తియునైన రావు బహదూర్ కందుకూరి వీరేశలింగముపంతులుగారు, చిరకాలము క్రిందట నాంధ్రకవులచరిత్రము మూడు భాగములుగా రచియించి , ఆ మూడు భాగముల నొక సంపుటముగానే మొదట ప్రకటించిరి. పిమ్మట మొదటి భాగములోని కవులనుగురించి నూతనాంశములం పెక్కులు లభించుటచే బ్రథమభాగమును విపులముగాఁజేసి దానినొక ప్రత్యేక సంపుటముగాఁ బ్రకటించిరి. ఆ సంపుటము పండితులయొక్కయు, భాషాభిమానులయొక్కయు, నాదరణముఁబడయుటచే నప్పుడు ప్రచురించిన గ్రంథములన్నియు విక్రయింపఁబడియెను. అందుచేత మూడు సంవత్సరముల క్రిందటనే యీ సంపుటము పునర్ముద్రణము కావలసియుండెను. ఈ గ్రంథమునుఁ బంపుమని యాంధ్ర దేశవునందలి నానాభాగములనుండి పలువురు వ్రాయు చున్నారు. ఆకారణమున నిప్పుడీ గ్రంథము రెండవసారి ముద్రింపబడి హితకారిణీసమాజము వారిచేతఁ బ్రకటింపఁబడినది.
జగమెఱుంగు బ్రాహ్మణునకు జందెమెందుకన్నట్లు శ్రీ వీరేశలింగంపంతులుగారి గ్రంథముయొక్క గుణములు వర్ణింపనక్కర లేదు. ఆవి పాఠక మహాశయులకే స్వయంవ్యక్తములుగదా ?
చిలకమర్తి లక్ష్మీనరసింహం, హితకారిణీసమాజోపాధ్యక్షుడు,
పెద్దాడ సుందరశివరావు, హితకారిణీసమాజగౌరవ కార్యదర్శి
రాజమహేంద్రవరము, 20-1- 1937