పుట:Aandhrakavula-charitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచించిన ముత్తరాజు, పరమభాగవత చరిత్రము రచించినయప్పన్న, మొదలైనవారు పలువురున్నారు. ఇటువంటివారికాలము చరిత్రము తెలిసినవారు సకారణముగా నాయుద్యమమునకు దోడ్పడుదురు గాక !

వెనుకటి కూర్పులలో నెల్ల 1450 వ సంవత్సరమువఱకు నుండిన కవులను మాత్రమే పూర్వకవులలోఁ జేర్చినను, ఈ కూర్పునం దిప్పుడు కొంచెము మార్చి 1450 వ సంవత్సరము మొదలుకొని 1400 వ సంవత్సరమువఱకును నుండిన కవులను గూడ నీ ప్రధమభాగమునందుఁ జేర్చి పూర్వకవులనుగాc జెప్పియున్నాను. ఆందుచేత నింత వఱకును మధ్యకవులుగా పరిగణింపఁబడి ద్వితీయ భాగములోఁ జేర్పcబడి యుండిన వారు నలుగురైదుగు రిఫ్పుడు పూర్వకవులుగా నీ ప్రథమభాగములోనికిఁ దీసికొనఁబడిరి. ఇట్టి మార్పుచేయుటకుఁ గల కారణమును గూర్చి విశేషముగాఁ జెప్పవలసినపనిలేదు. 1500 వ సంవత్సరప్రాంతము వఱకునుగల కాలము పురాణయుగమనికాని, భాషాంతరీకరణ కాలమని కాని చెప్పఁబడఁదగినది గానున్నది. 1508 సంవత్సరమునందు రాజ్యమునకువచ్చి తెలుగు కవిత్వమునకు నూతన జీవమును గలిగించి యాంధ్రభోజుఁ డని పేరొందిన కృష్ణదేవరాయని కాలమునుండియు నాంధ్ర వాఙ్మయమున కొక నూతనశక మారంభమైనది. కేవల భాషాంతరీకరణములు గాక రాజాదరము వలన నూతన కల్పనలతో ప్రబంధ రాజములు పుట్టనారంభ మయిన యీ కాలమును ప్రబంధయుగమని చెప్పవచ్చును. ఈ నూతన ప్రబంధ నిర్మాణమునకు మార్గదర్ళి యయిన వాఁడు కృష్ణదేవరాయలయాస్థానకవి యయి మనుచరిత్రమును రచియించి యాంధ్రకవితాపితామహుఁడని బిరుదు బొందిన యల్లసాని పెద్దన్న. పెద్దనయే యననేల? విష్ణుచిత్తీయ మనునామాంతరము గల యాము క్తమాల్యద యనెడి మహాప్రబంధమును రచించి కృష్ణదేవరాయలే మార్గదర్శి యయ్యెనని చెప్పినను చెప్పవచ్చును. ఆంధ్రసారస్వతమునందలి యానూతనశకారంభమునకుఁ బూర్వమునందుండినవారిని పూర్వకవులనియు, ఆ కాలమునకు నిప్పటికాలమునకు మధ్యకాలము నందుండినవారిని మధ్యక ఫులనియు విభాగముచేయుట యుక్తిసహము కాక పోదు.

కవులచరిత్రమును సంస్కరింప వలె నన్నబుద్ధి పుట్టిన మార్చి నెలలోనె పనికి బూని మార్చుట కారం భించి యప్పుడు మార్చిన దాని నప్పుడే ముద్రణమున కిచ్చుచు వచ్చితినని యీవఱకే చెప్పి యుంటిని గదా! మార్చుట కారంభించినప్పుడు పుస్తకమునంతను మరల వ్రాయుదు నన్నధైర్యము లేని వాఁడ నయి ప్రాఁతబొంతకు క్రొత్త యతుకులు వేసిన ట్లక్కడక్కడ నచ్చుపు స్తకములో నే క్రిందను విూఁదను మ్రుక్కలను హంస పాదములతో క్రొత్త ముక్కల నతికించుచు గ్రంథమును సాగింప నారంభించితిని. ఆందుచేతఁ గొన్నిచోట్ల నీక్రొత్తముక్కలు పూర్వోత్తర సందర్భమున కనుకూలమగునట్టు చక్కగా నతుకక కొందఱి చరిత్రములు కొంతవఱకతుకుల బొంతలుగానే యుండుట తటస్థించెను. తరువాత చరిత్రములను మార్చుటకయి గ్రంథపరిశోధనము చేయుచు వచ్చినప్పడు కొన్నిచోట్ల వెనుకటివారి చరిత్ర ములలో వేసినయతుకులలో గొన్ని తీసివేసి క్రొత్తమాసికలు వేయవలసినయావశ్యకము కనబడుచు వచ్చెను గాని ముద్రిత మయినదానిని మొదలంటc దీసివేయక