Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన సోమయాజి

తిక్కనసోమయాజి యనియెడి యీ కవి యించుమించుగా నన్నయ భట్టారకునికి రెండువందల సంవత్సరముల తరువాత నున్నట్టు కనఁబడు చున్నాడు. తిక్కనసోమయాజి నన్నయభట్టుతోడి సమకాలికుఁ డని జనులు వాడుకొనుచు, ఆ విషయమయి పెక్కుకధలు చెప్పుకొనుచున్నారు. *కాని యవి యవిచారమూలకము లగుటచేత మనము విశ్వసింపఁ దగినవి కావు. ఈ కవి తన నిర్వచనోత్తరరామాయణము నంకితము చేసిన మనుమభూపాలుఁడు పదమూఁడవ శతాబ్దమధ్యమున నున్నట్లు కొన్ని శిలా శాసనములవలనఁ దెలియవచ్చుచున్నది. ఈ మనుమరాజు తాతయును సిద్దిరాజని సామాన్యముగాఁ బిలువఁబడువాఁడును నయిన మనుమసిద్ధి పండ్రెండవ శతాబ్దమునందుండుట నిశ్చయము. అది గాక కృష్ణా మండలములో నందిగామ సీమలోని అనమంచిపల్లె గ్రామమునందలి శివాలయము యొక్క గర్భాలయము ముందఱి రాతి పలకమీఁది నాలింటిలో నొక శిలాశాసనమునందు శాలివాహనశకము 1182 వ సంవత్సరమందఁనగా క్రీస్తుశకము 1260 వ సంవత్సరమునందు "మన్మభూపతి" యున్నట్టు వ్రాయఁ బడియున్నది. మఱియును కృష్ణా మండలములోని నూజివీడు సంస్థానములోని కొండనాయనివర గ్రామములోని చెఱువుగట్టు మీఁద నున్నదేవాలయ సమీపమునందలి యొక రాతిమీఁద చెక్కcబడిన దానశాసనములో శాలివాహనశకము 1179 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తుశకము 1256 వ సంవత్సరమునందు 'మనుమరాజు" భూదానము చేసినట్టు చెప్పఁబడి యున్నది. పైవి గాక మనుమసిద్దిరాజుయొక్క శాసనములు కందుకూరిసీమలోని పెంట్రాలగ్రామములో 1257 వ సంవత్సరము మొదలుకొని 1260 వ సంవత్సరమువఱకును నున్నవి కానిపించుచున్నవి. 1257 వ సంవత్సరములోని నందలూరు శాసనములో మనుమ _________________________________________________________________________ [*చూ. శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారి 'కవి జీవితములు']