పుట:Aandhrakavula-charitramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శి వ దే వ య్య

శివ దేవయ్య గొప్ప విద్వాంసుఁడు. రాజ్యతంత్రజ్ఞుఁడు; ఇతc డోరుగంటిని పాలించిన గణపతిదేవుని యొద్దను, ఆతని పుత్రికయగు రుద్రమదేవి యొద్దను మంత్రిగానుండెను. మనుమసిద్ధిని తిరిగి రాజ్యమును నిలుపుటలోఁ దిక్కనకు మిగుల తోడ్పడెనcట. ఇతడు గణపతిదేవుని దీక్షాగురువగు విశ్వేశ్వర దేశికుల కంటె విభిన్నుఁడు.

ఇతఁడు 'పురుషార్థసార' మను గ్రంధమును రచించెనని 'సకలనీతి సమ్మతము'న నుదాహరింపఁబడిన యందలి పద్యములనుబట్టి తెలియుచున్నది. ఆ గ్రంథము మాత్రము లభింపలేదు.

శివ దేవయ్య 'శివ దేవధీమణీ ' అను మకుటముతో నొక శతకమును రచించెనని తెలుపుచు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగా రందలి పద్యము నొక దానిని తమ "త్రిపురాంతకోదాహరణ" పీఠికలో నుదాహరించియున్నారు

ఈతనికి 'ఆంధ్రకవితాపితామహ' బిరుదము కలదు. తర్వాత అల్లసాని పెద్దన మున్నగువారి కీబిరుద మీయఁబడినది. ఈ బిరుదు పొందినవారిలో నీతఁడే ప్రధముఁడని తెలియుచున్నది.